ఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్ : తరుణ్ చుగ్

ఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్ : తరుణ్ చుగ్

ఎంఐఎం చేతిలో కారు (బీఆర్ఎస్) స్టీరింగ్ ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలన కొనసాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని (రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందే అవకాశం) కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కుటుంబపాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేది కేవలం బీజేపీ మాత్రమే అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు బీ టీమ్ అన్నారు. తెలంగాణ ప్రజలకు  నమ్మక ద్రోహం చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. రెండు సార్లు తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు  అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించిన తరుణ్ చుగ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

దేశంలోని గ్రామ గ్రామాన స్వతంత్ర సమరయోధులు, దేశంకోసం ప్రాణాలర్పించిన వీర జవానుల విగ్రహలను ప్రతిష్టిస్తామని తరుణ్ చుగ్ హామీ ఇచ్చారు. మేరీ మిట్టీ మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం నుంచి బీజేపీ కార్యకర్తల ద్వారా పిడికెడు మట్టిని సేకరించి.. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అమృత్ వన్ నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ మెట్రో నగరాలకు కేంద్రం నిధులు ఇస్తే తెలంగాణ రాష్ట్రం వాటిని పక్కదారి పట్టిస్తోందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.