హైదరాబాద్, వెలుగు: ఈ నెల 7న నిర్వహించనున్న బూత్ కమిటీ సభ్యుల భేటీ ఏర్పాట్లపై రాష్ట్ర బీజేపీ ఇన్చార్జ్లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ సోమవారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. పార్టీ స్టేట్ చీఫ్బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల బీజేపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అసెంబ్లీ కన్వీనర్లు, ఇన్చార్జ్లు, పాలక్ లు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ నేతలకు ప్రోగ్రామ్ సక్సెస్ పై సంజయ్ దిశానిర్దేశం చేశారు. సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ కూడా పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. ఈ నెల 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో బూత్ స్థాయి ముఖ్య నేతలంతా పాల్గొనాలని, పార్టీ చీఫ్ జేపీ నడ్డా ప్రసంగాన్ని విని, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని 34 వేల 600 బూత్ కమిటీలకు చెందిన 7 లక్షల 26 వేల 600 మంది బీజేపీ కార్యకర్తలు ఈ వర్చ్యువల్ మీటింగ్ లో పాల్గొననున్నారు.
ఇయ్యాల హైదరాబాద్కు ప్రహ్లాద్ జోషి
బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన ప్రోగ్రామ్ లో భాగంగా మంగళవారం పార్లమెంటరీ వ్యవహారాలు , బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందు కోసం ఆయన సోమవారం సాయంత్రమే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి పలువురు పార్టీ నేతలు స్వాగతం పలికారు.
త్వరలో మేధావులతో సమావేశాలు
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల మేధావులతో సమావేశాలు, సెమినార్ లకు ప్లాన్ చేస్తున్నది. ఉద్యమ సమయంలో రాష్ట్రం కోసం ఏవిధంగా సెమినార్ లు జరిగాయో ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరంపై వీటి కోసం ఏర్పాట్లు చేస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా వీటిని నిర్వహించి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా ప్లాన్ చేస్తున్నది.