బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి : తరుణ్​ చుగ్​

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి : తరుణ్​ చుగ్​

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌‌ తరుణ్‌‌ చుగ్‌‌ అన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చూపిస్తామని ఆయన చెప్పారు. ఏటా సెప్టెంబర్‌‌ 17న ప్రతీ గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. బుధవారం తరుణ్‌‌ చుగ్ ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన రీలీజ్ చేశారు. రాష్ట్రంలో ఉపాధి హామీ స్కీంను తుంగలో తొక్కిన సీఎం కేసీఆర్ కు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. 

పదేండ్ల క్రితం బంగారు తెలంగాణ హామీతో పవర్ లోకి వచ్చిన ఆయన.. తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకున్నారని ఆరోపించారు. బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వంలో అహంకారం, అవినీతి, కుటుంబ పాలన, శాంతిభద్రతల సమస్యలు తారస్థాయికి చేరుకున్నాయని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను, బీఆర్ఎస్ సర్కార్ ను అసదుద్దీన్‌‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీయే నడిపిస్తోందన్నారు. 

బీఆర్‌‌ఎస్‌‌ స్టీరింగ్‌‌ మజ్లిస్‌‌ పార్టీ చేతుల్లో ఉందన్నారు. రాష్ట్రంలో మజ్లిస్‌‌ను వీడి ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వాన్ని తేవాలంటే ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీతోనే సాధ్యమన్నారు. దేశం మొత్తం బలపరుస్తున్న బీజేపీ తెలంగాణను వచ్చే ఐదేండ్లు పాలించాలా? లేక అవినీతి కుంభకోణాలు చేసే బీఆర్‌‌ఎస్, కాంగ్రెస్‌‌ పార్టీలు పాలించాలా? అనేది ప్రజలే తేల్చుకోవాలన్నారు. తన కొడుకు కేటీఆర్‌‌ను సీఎం చేయాలని, లిక్కర్ స్కాంలో తన బిడ్డ కవితను జైలుకు పోకుండా కాపాడాలన్న లక్ష్యంతోనే కేసీఆర్ పని చేస్తున్నారని విమర్శించారు.