రాచకొండ సీపీగా తరుణ్​ జోషి.. 12 మంది ఐపీఎస్​లు బదిలీ

రాచకొండ సీపీగా తరుణ్​ జోషి..  12 మంది ఐపీఎస్​లు బదిలీ

 

  • 12 మంది ఐపీఎస్​లను బదిలీ చేసిన ప్రభుత్వం 
  • 110 మంది డీఎస్పీలు, 39 మంది ఏఎస్పీలు కూడా
  • పోలీసు శాఖలో కొనసాగుతున్న ట్రాన్స్​ఫర్లు
  • నలుగురు ఐఏఎస్​లను బదిలీ చేసిన సీఎస్​ 

హైదరాబాద్, వెలుగు :  పోలీస్ డిపార్ట్ మెంట్ లో బదిలీల పర్వం కొనసాగుతున్నది. 12 మంది ఐపీఎస్‌‌లు, 110 మంది డీఎస్పీలు, 39 మంది ఏఎస్పీలు, ఐదుగురు ఎస్పీలను (నాన్​కేడర్)  ట్రాన్స్​ఫర్ చేస్తూ సోమవారం సీఎస్​ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ సీపీగా తరుణ్‌‌జోషిని కొత్తగా నియమించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్‌‌ కమిషనర్‌‌ సుధీర్‌‌బాబును హైదరాబాద్‌‌ మల్టీజోన్‌‌ ఐజీగా నియమించారు. 

రామగుండం సీపీగా ఎం శ్రీనివాసులు, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీగా జోయల్‌ డేవిస్‌, సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్‌, టీఎస్‌ఆర్‌టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా అపూర్వరావు, హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీగా గిరిధర్‌, హైదరాబాద్‌ సౌత్‌వెస్ట్‌ డీసీపీగా ఉదయ్‌కుమార్‌రెడ్డి, జోగులాంబ డీఐజీగా ఎల్‌ఎస్‌ చౌహాన్‌, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా సాధన రష్మి, పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా మురళీధర్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు. డి. నవీన్ కుమార్‌ను డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఐదుగురు ఎస్పీ(నాన్​కేడర్) లు కూడా..

ఐదుగురు ఎస్పీ(నాన్ కేడర్)లను ట్రాన్స్ ఫర్ చేస్తూ సోమవారం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈస్ట్ జోన్​డీసీపీ బి.సాయి శ్రీ ని సైబరాబాద్​స్పెషల్​బ్రాంచ్​డీసీపీగా, సైబరాబాద్ స్పెషల్​బ్రాంచ్​డీసీపీ జె.అశోక్ కుమార్​ను సీఐడీకి, టాస్క్​ఫోర్స్​డీసీపీ బి.శ్రీ బాల దేవి ని మాదాపూర్​ ఎస్వోటీ డీసీపీగా, మాదాపూర్​ ఎస్వోటీ డీసీపీ ఎం.ఏ. రషీద్ ను ఇంటెలిజెన్స్​కు, సీఐడీ ఎస్పీ ఆర్.జగదీశ్వర్​రెడ్డి ని ట్రాన్స్​కోకు బదిలీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది డీఎస్పీలు, 39 అడిషనల్ ఎస్పీల (నాన్​కేడర్​) ను ట్రాన్స్ ఫర్ చేస్తూ సోమవారం డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లు సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా యూనిట్ల నుంచి బదిలీలు చేసారు. త్వరలోనే మరికొంత మందిని ట్రాన్స్ ఫర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

నలుగురు ఐఏఎస్​ల బదిలీలు

నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న చిత్రా మిశ్రాను ఏటూరునాగారంలోని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా బదిలీ చేశారు. ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంకిత్‌ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బదిలీ చేశారు. ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న ఖుష్బూ గుప్తాను ఉట్నూర్ ఐటీడీఏ అధికారిగా ట్రాన్స్ ఫర్ చేశారు. లాంగ్ లీవ్ తర్వాత వచ్చిన ఉట్నూర్ ఐటీడీఏ అధికారి చాహత్ బాజ్ పాయిని తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

14 మంది ఎక్సైజ్​ సూపరింటెండెంట్ల బదిలీలు

చాలా ఏండ్ల తర్వాత రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. 14 మంది ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, తొమ్మిది మంది సహాయ కమిషనర్లను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్‌ 1లో 64 మంది, మల్టీజోన్‌ 2లో 85 మంది ఎక్సైజ్‌ సీఐలకు ట్రాన్స్​ఫర్లు చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మూడేండ్లుగా ఒకే రెవెన్యూ జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేసినట్లు అధికారులు చెప్తున్నారు.