గండిపేట, వెలుగు : హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ఓ ప్రయాణికుడికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయ ప్రధాన మార్గంలో వెళ్తున్న టాటా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎయిర్‌పోర్టుకు సమీపంలోకి చేరుకోగానే కారు ఇంజిన్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కారును రోడ్డు పక్కన నిలిపి బయటకు వచ్చాడు.
క్షణాల్లోనే మంటలు కారంతటా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఎయిర్‌పోర్టు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
