వాతావరణ మార్పులపై స్టడీకి మేమే ప్రయోగించినం: టాటా ఇన్​స్టిట్యూట్ 

వాతావరణ మార్పులపై స్టడీకి మేమే ప్రయోగించినం: టాటా ఇన్​స్టిట్యూట్ 
  • ఉలిక్కిపడ్డ స్థానికులు.. 4 గంటల పాటు టెన్షన్​
  • గ్రహాంతరవాసులు ప్రయోగించి ఉంటారని చూసేందుకు భారీగా జనం రాక  
  • వాతావరణ మార్పులపై స్టడీకి తామే ప్రయోగించామన్న టాటా ఇన్​స్టిట్యూట్ 
  • హైదరాబాద్ ఈసీఐఎల్ లోని నేషనల్ బెలూన్ ఫెసిలిటీ నుంచి ప్రయోగం 

హైదరాబాద్, వెలుగు:  వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్ల గ్రామ శివారులోని పొలంలో బుధవారం ఉన్నట్లుండి ఆకాశం నుంచి ఒక వింత బెలూన్ వచ్చి పడింది. దీంతో జనం ఆందోళనకు గురయ్యారు. అది ఏమై ఉంటుందని టెన్షన్ పడ్డారు. ఆ బెలూన్ లో కుర్చీలు కూడా ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది గ్రహాంతరవాసులు ప్రయోగించినదై ఉంటుందని ప్రచారం జరగడంతో చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బెలూన్​ ఆకాశంలో ఎగురుతూ నెమ్మదిగా కిందికి దిగుతూ వచ్చింది. 

ఉదయం 7:30 గంటల ప్రాంతంలో అప్పా జంక్షన్​సమీపం నుంచి దాన్ని చూసిన కొంతమంది అదేంటని ఆందోళనకు గురయ్యారు. విమానాల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో బెలూన్ కనిపించడంతో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా? అని టెన్షన్ పడ్డారు. ఈ విషయం మీడియాలో రావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ బెలూన్ ను వాతావరణ మార్పులపై స్టడీకి టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్లు ప్రయోగించారని తేల్చారు. దీంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. స్పెయిన్ కు చెందిన కంపెనీ కోసం ప్రయోగం చేశామని, ఇలాంటి బెలూన్లు తరచూ ప్రయోగిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రయోగాలపై ఎయిర్ పోర్టు అథారిటీకి ఎప్పుడూ ముందే సమాచారం ఇస్తామని చెప్పారు. బెలూన్​పడిన చోటుకు వెంటనే చేరుకున్న సంస్థ ప్రతినిధులు..  దాన్ని విడి భాగాలుగా చేసి తరలించారు. ఇలాంటి బెలూన్లు 6 నుంచి 8 గంటల పాటు వాతావరణంలో తిరుగుతాయి. తర్వాత కిందికి దిగుతాయి. టాటా సంస్థ పంపిన బెలూన్​ఉదయం 9:30 గంటల సమయంలో కిందికి వచ్చింది. ఇది నిర్ణీత సమయానికంటే ముందే కిందికి దిగినట్లు తెలుస్తోంది. 

అనుకున్న లొకేషన్ కు అర కిలోమీటర్ దూరంలో ల్యాండింగ్: సైంటిస్ట్ 

ఈసీఐఎల్​లోని నేషనల్ బెలూన్​ఫెసిలిటీ నుంచి బుధవారం ఉదయం 5:30 గంటలకు బెలూన్​ను ఆకాశంలోకి పంపినట్లు సంస్థ సైంటిస్ట్ ​ప్రవీణ్ రెడ్డి తెలిపారు. బెలూన్ మొగిలిగుండ్ల సమీపంలో ల్యాండ్​ అయ్యేలా ప్లాన్ చేసినట్లు చెప్పారు. అయితే తాము అనుకున్న లొకేషన్​కు అర కిలోమీటర్ దూరంలో ల్యాండ్ అయిందని పేర్కొన్నారు. సాధారణంగా వాతావరణంలోని మార్పులపై నేరుగా అధ్యయనం చేయడానికి ఇలాంటి బెలూన్లను అప్పుడప్పుడు ప్రయోగిస్తామని వెల్లడించారు. హీలియం ఇంధనంతో గాలిలో ఎగిరే ఈ బెలూన్​కు దాదాపు వెయ్యి కిలోల బరువు ఉండే పరికరాలు అమర్చి ఉంటాయని, ఇందులో నలుగురి వరకు కూర్చొని కూడా ప్రయాణించవచ్చని తెలిపారు. శాటిలైట్ నుంచి అందిన సమాచారంతో పాటు భూ ఆవరణలోని మార్పులను సరిపోల్చడానికి ఇలాంటి ప్రయోగాలు ఉపయోగపడతాయన్నారు. కాగా, తాము నాలుగు ప్రయోగాలకు ఉద్దేశించి బెలూన్​ ప్రయోగించామని, ఇందులో మూడు పూర్తి చేయగలిగామన్నారు.  

ప్రజలకు అవగాహన కల్పించాలి: రఘు


ఇలాంటి ప్రయోగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే ఎలాంటి అపోహలకు తావుండదని ప్లానిటరీ సొసైటీ ఆఫ్​ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ అన్నారు. ‘‘హైదరాబాద్ ఇలాంటి ప్రయోగాలకు ఎంతో అనువైన ప్రదేశంగా ఉండడం మనకు గర్వకారణం. భూ అయస్కాంత పరిధి, గాలివాటం దిశ తదితర ఎన్నో అనుకూలమైన అంశాలు పరిశోధనలకు అనువుగా ఉన్నాయి. అందుకే దీన్ని మనం గొప్పగా చెప్పుకోవాలి. జనానికి కూడా విస్తృతంగా తెలియజేయాలి. అప్పుడే అపోహలకు తావుండదు’’ అని అన్నారు. దీనివల్ల పిల్లల్లోనూ సైన్స్ పై అవగాహన పెరుగుతుందన్నారు.

ఫ్లైట్లకు ప్రమాదం లేదు: ఎయిర్​పోర్టు అధికారులు

వాతావరణ మార్పులపై స్టడీ చేయడానికి ప్రయోగించే ఇలాంటి బెలూన్ల వల్ల విమానాలకు ప్రమాదేమేమీ ఉండదని ఎయిర్​పోర్టు అధికారులు తెలిపారు. ఈ ప్రయోగాల సమాచారం తమకు ముందుగానే ఉంటుందని చెప్పారు. టాటా సంస్థ కూడా సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. ‘‘ఫ్లైట్ రన్​వే నుంచి టేకాఫ్ కాగానే చాలా ఎత్తుకు వెళ్లిపోతుంది. ఇలాంటి బెలూన్లు అడ్డం రావు. అయితే ఫ్లైట్ కు ఐదారు కిలోమీటర్ల రేంజ్​లోకి ఇలాంటి వస్తువులు వస్తే ప్రమాదమే. ఏటీసీలోని రాడార్​10 నుంచి 15 కిలోమీటర్ల రేంజ్​లో ఎలాంటి కొత్త ఆబ్జెక్ట్ కనిపించినా పసిగడుతుంది. నిరంతర నిఘా ఉంటుంది” అని వివరించారు.