
దీపావళి, ధన్‌తేరాస్ పండుగ సీజన్‌లో ఆటోమొబైల్ సేల్స్ దుమ్ములేపాయి. మారుతి, టాటా మోటార్స్, హ్యుందాయ్ కంపెనీలు రికార్డు స్థాయిలో కార్లు అమ్మి, డెలివరీలు చేశాయి. GST 2.0 వల్ల ప్రజల్లో కొనుగోళ్ల ఉత్సాహం పెరిగింది. ఈ కారణంగా పెద్ద కార్ల కంపెనీలు దేశవ్యాప్తంగా ధన్‌తేరాస్ డెలివరీలు బాగా జరిగాయని, కొత్త కార్లకు డిమాండ్ గట్టిగ ఉందని ప్రకటించాయి.
సాధారణంగా ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజైన ధన్‌తేరాస్‌ను బంగారం, వెండి, కొత్త వాహనాలు కొనడానికి చాలా మంచి రోజుగా భావిస్తారు. కానీ ఈసారి ధన్‌తేరాస్ అక్టోబర్ 18 మధ్యాహ్నం నుండి 19 మధ్యాహ్నం వరకు రెండు రోజులు ఉండటం వల్ల కస్టమర్లకు కొనుగోళ్లకి ఎక్కువ సమయం దొరికింది, ఇలా కార్ల కంపెనీల సేల్స్ పెరగడానికి సహాయపడింది.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అమిత్ కామత్ మాట్లాడుతూ ఈ ఏడాది ధన్‌తేరాస్, దీపావళి డెలివరీలు మంచి ముహూర్తాలు చూసుకుని రెండు నుంచి మూడు రోజుల్లో జరుగుతాయి. డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. GST 2.0 పాజిటివ్ వాతావరణాన్ని ఇచ్చింది. ఈ టైంలో మేము 25వేల కార్లు డెలివరీ చేయాలని అనుకుంటున్నాం అని అన్నారు.
ఇక ఈ పండుగ సీజన్‌లో డెలివరీలు 50వేల మార్కు దాటవచ్చని మారుతి సుజుకి భావిస్తోంది. ఈ అంచనా గత సంవత్సరం అమ్మిన 41,500 యూనిట్ల కంటే దాదాపు 10 వేలు ఎక్కువ.
►ALSO READ | EPFO పెన్షన్ స్కీం: వీరికి గుడ్ న్యూస్.. కొత్తగా వచ్చిన మార్పులు ఇవే..
మారుతి సుజుకి మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ ప్రతిరోజూ మాకు దాదాపు 14వేల బుకింగ్‌లు వస్తున్నాయి. మేము ధరలు తగ్గించినప్పటి నుండి 4.5 లక్షల బుకింగ్‌లు వచ్చాయి, అందులో 1 లక్ష చిన్న కార్ల కోసం వచ్చాయి అని అన్నారు. ఈ పండుగ సమయంలో రిటైల్ డెలివరీలు 3.25 లక్షల వాహనాలను తాకాయని, గత ఏడాదితో పోలిస్తే 50% పెరుగుదల అని చెప్పారు.
హ్యుందాయ్ మోటార్ ఇండియా (HMIL) కూడా ధన్‌తేరాస్‌కు మంచి డిమాండ్‌ను చూస్తోంది. హ్యుందాయ్ మోటార్స్ డైరెక్టర్ & COO తరుణ్ గార్గ్ మాట్లాడుతూ కస్టమర్ల నుండి మంచి డిమాండ్ చూస్తున్నాం. డెలివరీలు దాదాపు 14వేల యూనిట్లుగా ఉంటాయని అంచనా, గత సంవత్సరం కంటే దాదాపు 20% ఎక్కువ. పండుగ వాతావరణం, మంచి మార్కెట్ పరిస్థితులు, GST 2.0 తర్వాత వచ్చిన ఉత్సాహం అన్నీ కలిపి అమ్మకాలు పెరగడానికి దోహదపడ్డాయని చెప్పారు. పండుగ సీజన్ జోరుగా సాగుతుండటంతో కార్ల కంపెనీలు మంచి సేల్స్, డిమాండ్, రికార్డు డెలివరీలను ప్రకటించాయి.