BAN vs WI: వామ్మో పిచ్‌పై ఈ పగుళ్లేంటి: బంగ్లాదేశ్, వెస్టిండీస్ రెండో వన్డే.. 50 ఓవర్లు స్పిన్నర్లు వేశారుగా

BAN vs WI: వామ్మో పిచ్‌పై ఈ పగుళ్లేంటి: బంగ్లాదేశ్, వెస్టిండీస్ రెండో వన్డే.. 50 ఓవర్లు స్పిన్నర్లు వేశారుగా

వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో పిచ్ చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఢాకా వేదికగా మంగళవారం (అక్టోబర్ 21) ప్రారంభమైన ఈ మ్యాచ్ పిచ్ దారుణంగా ఉంది. షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ పిచ్ పై భారీగా పగుళ్లున్నాయి. బంతి వేస్తే ఎటు తిరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. విపరీతమైన క్రాక్స్ ఉన్న ఈ పిచ్ పై బంతి పడగానే అనూహ్యంగా టర్న్ అవుతుంది. దీనిని ఎవరైనా పిచ్ అంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గల్లీ క్రికెట్ లో కూడా ఇంతకంటే పిచ్ బాగుంటుందని నెటిజన్స్ భావిస్తున్నారు. 

మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసి ఒక మాదిరి స్కోర్ మాత్రమే చేయగలిగింది. పిచ్ బాగా హార్డ్ గా ఉండడంతో విండీస్ జట్టు 50 ఓవర్లను స్పిన్నర్ల చేత వేయించడం విశేషం. ఆశ్చర్యకరంగా వెస్టిండీస్ జట్టు ఒక్క ఫాస్ట్ బౌలర్ తో కూడా ఈ మ్యాచ్ లో బరిలోకి దిగకపోవడం షాకింగ్ కు గురి చేస్తోంది. అకేల్ హోసిన్, రోస్టన్ చేజ్, అలిక్ అథనాజ్, గుడాకేష్ మోతీ, ఖారీ పియరీ తలో 10 ఓవర్లు వేసి తమ స్పెల్ పూర్తి చేశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో విండీస్ మొత్తం 50 ఓవర్లను స్పిన్నర్లకే అప్పగించింది. 

►ALSO READ | Asia Cup 2025 Trophy: ట్రోఫీ ఇచ్చేయండి.. లేకపోతే తీవ్రంగా స్పందిస్తాం: నఖ్వీకి బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. పిచ్ స్పిన్ కు అనుకూలించడంతో విండీస్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆతిధ్య బంగ్లా జట్టును కట్టడి చేశారు. 45 పరుగులు చేసిన సౌమ్య సర్కార్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ 32 పరుగులు చేసి రాణించగా.. చివర్లో రిషద్ హుస్సేన్ 14 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి చివర్లో జట్టును 200 స్కోర్ దాటించాడు. వెస్టిండీస్ బౌలర్లలో గుడాకేష్ మోతీ మూడు వికెట్లు పడగొట్టాడు. అకేల్ హోసిన్, అలిక్ అథనాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి వన్డేలో బంగ్లాదేశ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది.