Asia Cup 2025 Trophy: ట్రోఫీ ఇచ్చేయండి.. లేకపోతే తీవ్రంగా స్పందిస్తాం: నఖ్వీకి బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్

Asia Cup 2025 Trophy: ట్రోఫీ ఇచ్చేయండి.. లేకపోతే తీవ్రంగా స్పందిస్తాం: నఖ్వీకి బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్

ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్ లోనే ఉంది. సెప్టెంబర్ 28న పాకిస్థాన్ పై జరిగిన ఫైనల్లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి ఆసియా   కప్ గెలుచుకుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా నిరాకరించడంతో ట్రోఫీని  మోహ్సిన్ నఖ్వీ తన వెంట ట్రోఫీని ACC కార్యాలయానికి తీసుకెళ్లిపోయాడు. ఈ మెగా టోర్నీ టీమిండియా గెలుచుకొని దాదాపుగా నెల కావొస్తున్నా ఇంకా మన జట్టుకు టైటిల్ అందలేదు. ఆసియా కప్ 2025 ట్రోఫీని వెంటనే భారత క్రికెట్ జట్టుకు అందించాలని డిమాండ్ చేస్తూ బీసీసీఐ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్ మోహ్సిన్ నఖ్వీకి అధికారికంగా లేఖ రాసింది.

నఖ్వీ సమాధానం కోసం తాము ఎదురు చూస్తున్నామని.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇండియా టుడేతో మాట్లాడుతూ వెల్లడించారు. అతని దగ్గర నుంచి తమకు సరైన సమాధానం రాకపోతే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి అధికారిక ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అయన అన్నారు. బోర్డు దశలవారీ ప్రక్రియను అనుసరిస్తోందని సైకియా గట్టిగా చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 30న జరిగిన ACC సమావేశంలో, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. నఖ్వీ చర్యలను తీవ్రంగా ఖండించారు. ట్రోఫీని అధికారికంగా భారత జట్టుకు అందజేయాలని.. ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ ఆధీనంలోనే ఉండాలని డిమాండ్ చేశారు.

►ALSO READ | Women's ODI World Cup 2025: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు: చివరి ఓవర్లో లంకపై ఓడిన బంగ్లా.. వరల్డ్ కప్ నుంచి ఔట్

ఇండియాకు ట్రోఫీ కావాలంటే దుబాయ్‌‌లోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ( ఏసీసీ) హెడ్‌‌ ఆఫీస్‌‌లో తన వద్దకు వచ్చి తీసుకోవచ్చని ఏసీసీ ప్రెసిడెంట్‌‌, పాకిస్తాన్ మంత్రి మోహ్‌‌సిన్ నఖ్వీ రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. ట్రోఫీని ఇండియాకు అప్పగించకపోవడంతో ఏసీసీ ఏజీఎంలో బీసీసీఐ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను బీసీసీఐకి క్షమాపణ చెప్పినట్లు వచ్చిన వార్తలను నఖ్వీ ఎక్స్‌‌ వేదికగా ఖండించాడు. ‘నేను బీసీసీఐకి ఎప్పుడూ క్షమాపణ చెప్పలేదు. ఎప్పటికీ చెప్పను. ఏసీసీ ప్రెసిడెంట్‌‌గా  ఆ రోజు ట్రోఫీని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. వాళ్లకు (ఇండియా)ట్రోఫీ కావాలంటే ఏసీసీ ఆఫీస్‌‌కు వచ్చి నా నుంచి తీసుకోవచ్చు’ అని పోస్ట్ చేశాడు.