Women's ODI World Cup 2025: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు: చివరి ఓవర్లో లంకపై ఓడిన బంగ్లా.. వరల్డ్ కప్ నుంచి ఔట్

Women's ODI World Cup 2025: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు: చివరి ఓవర్లో లంకపై ఓడిన బంగ్లా.. వరల్డ్ కప్ నుంచి ఔట్

మహిళల వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ కు బిగ్ హార్ట్ బ్రేక్. శ్రీలంకపై సోమవారం (అక్టోబర్ 20) జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో చివరి వరకు పోరాడి ఓడిపోయింది. ఆతిధ్య లంక జట్టు విధించిన 203 పరుగుల ఒక మాదిరి టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో బంగ్లా అద్భుతంగా ఆడింది. చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు చేస్తే విజయం. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఈ దశలో బంగ్లా విజయం ఖాయమని దాదాపు ప్రతి ఒక్కరు భావించారు. అయితే ఈ దశలో శ్రీలంక మ్యాజిక్ చేసింది. కీలకమైన 49 ఓవర్లో సుగంధిక కుమారి కేవలం మూడు పరుగులే ఇచ్చి వికెట్ తీసుకొని మ్యాచ్ ను ఫైనల్ ఓవర్ వరకు తీసుకెళ్లింది. 

చివరి ఓవర్లో బంగ్లా విజయానికి 9 పరుగులు అవసరం. ఈ దశలో చమారి అథపత్తు తీవ్ర ఒత్తిడిలో చివరి ఓవర్ లో బౌలింగ్ తీసుకుంది. తొలి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడడంతో మ్యాచ్ పూర్తిగా లంక వైపు మొగ్గింది. తొలి బంతికి రబెయా ఖాన్ ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ కాగా.. రెండో బంతికి నహిదా అక్తర్ రనౌటయింది. మూడో బంతికి భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియబ్ బాట పడితే.. నాలుగో బంతికి మారుఫా అక్తర్ ఎల్బీడబ్ల్యూ అయింది. ఇక చివరి రెండు బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా ఒక పరుగు మాత్రమే వచ్చింది. దీంతో శ్రీలంక 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళా జట్టు 48.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. హాసిని పెరెరా ఒంటరి పోరాటం చేసి 85 పరుగులు చేసి స్కోరర్ గా నిలిచింది. చామరి అథపత్తు (46), నీలాక్షి డి సిల్వా (37) రాణించారు. బంగ్లా బౌలర్లలో షోర్నా అక్తర్ మూడు వికెట్లతో రాణించింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి 7 పరుగులు తేడాతో ఓడిపోయింది. నిగర్ సుల్తానా (77), షర్మిన్ అఖ్తర్ (64) హాఫ్ సెంచరీలు చేసి పోరాడినప్పటికీ విజయాన్ని అందించలేకపోయారు. ఏ ఓటమితో బంగ్లాదేశ్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు శ్రీలంక వరల్డ్ కప్ లో తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది.