పతకం చేజారిన ఒలింపియన్లకు టాటా కార్ల బహుమతి

పతకం చేజారిన ఒలింపియన్లకు టాటా కార్ల బహుమతి

టోక్యో ఒలింపిక్స్ లో పతకాలతో తిరిగొచ్చిన వారికి దేశ దేశాల నుంచి బహమానాలు వెల్లువెత్తుతుంటే.. తృటిలో పతకం తప్పిపోయిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది..? నిజమే.. చాలా బాధగా ఉంటుంది. టోర్నీ ముగిసినా.. ఇప్పటికీ ఆ బాధ గుండెల్ని తొలిచేస్తుంటే కళ్లనిండా నీళ్లతో మళ్లీ సాధారణ ప్రాక్టీస్ మొదలుపెట్టడం ఇప్పట్లో సాధ్యమేనా.. ? కానీ.. ఇలాంటి వారి పరిస్థితిని గుర్తించిన టాటా మోటార్స్ గెలుపోటములు.. పతకాలతో సంబంధం లేకుండా సత్కరించింది. 
టోక్యో ఒలింపిక్స్ లో వివిధ విభాగాల్లో మంచి పోరాట పటిమ కనపరచి పతకాలు కోల్పోయిన  24 మంది క్రీడాకారులకు టాటా మోటార్స్  అల్ట్రోజ్ ప్రీమియం  హ్యాచ్ బ్యాక్ కార్లను బహుమతిగా ఇచ్చింది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ మైదానంలో పోరాడినా తృటిలో పతకం తప్పిపోవడం బాధాకరమే అయినా.. వారి పోరాట పటిమ, చివరి క్షణం వరకు పోరాడిన దృఢ సంకల్పం ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తి కలిగించాయని, కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న వారికి తమవంతుగా కార్లతో సత్కరించినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.