
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ ఈ ఏడాది (2025) సెప్టెంబర్‌లో 60,907 ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే కంపెనీ సేల్స్ 47శాతం పెరిగాయి. జీఎస్‌టీ 2.0 రేటు తగ్గింపు, నవరాత్రి పండుగ డిమాండ్ ఈ వృద్ధికి దోహదం చేశాయి.
ఈవీ అమ్మకాలు 96శాతం పెరిగి 9,191 యూనిట్లకు, సీఎన్‌జీ వాహనాల సేల్స్105శాతం పెరిగి 17,800 యూనిట్లకు చేరాయి. 22,500 నెక్సాన్ మోడల్ యూనిట్లు సేల్ అవ్వడం గమనార్హం. హ్యారియర్, సఫారి, పంచ్ మోడల్స్‌కు కూడా మంచి డిమాండ్ కనిపించింది. టాటా మోటార్స్ తన కమర్షియల్ వెహికల్ విభాగాన్ని డీమెర్జర్ చేయడానికి అక్టోబర్ 14ను రికార్డ్ డేట్‌గా ప్రకటించింది.
ఈ తేదీకి ముందు టాటా మోటార్స్ షేర్లు కలిగి ఉన్న షేర్‌హోల్డర్లు, టీఎంఎల్ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్‌లో ఒక్కో షేర్‌కు ఒక షేర్ పొందే అర్హత కలిగి ఉంటారు. ఈ డీమెర్జర్ అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. టీఎంఎల్‌సీవీ షేర్లు త్వరలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ఈలో లిస్టింగ్ అవుతాయి.
మారుతి, హ్యుందాయ్ సేల్స్ అప్..
కిందటి నెలలో మారుతి సుజుకీ మొత్తం 1,89,665 వాహనాల విక్రయించింది. కిందటేడాది ఇదే నెలతో పోలిస్తే 3శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎక్స్‌పోర్ట్స్ 42,204 యూనిట్లకు పెరిగాయి. మరోవైపు హ్యుందాయ్ సెప్టెంబర్‌లో 70,347 యూనిట్ల అమ్మకాలతో 10శాతం వృద్ధిని సాధించింది.