
న్యూఢిల్లీ: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ విధానంలో నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్‌సీడీలు) జారీ చేసి రూ.500 కోట్లు సేకరించాలని టాటా మోటార్స్ లిమిటెడ్ బోర్డు నిర్ణయించింది. కంపెనీ స్టాక్‌ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం, రెండు విడతల్లో ఒక్కోటి రూ.1 లక్ష ముఖ విలువ కలిగిన 50,000 ఎన్‌సీడీలను కంపెనీ అమ్మనుంది. ఏడాదికి 7.08 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది.
మొదటి విడతలో 30,000 ఎన్‌సీడీలు, మిగిలినవి రెండో విడతలో కేటాయిస్తారు. ఎన్‌సీడీల ద్వారా సేకరించిన ఫండ్స్‌ను ఎందుకు వాడతారో బయటపెట్టలేదు. ‘క్రిసిల్ ఏఏ+/స్టేబుల్’ రేటింగ్ ఉన్న ఈ ఎన్‌సీడీలు ఎన్‌ఎస్‌ఈ హోల్‌సేల్ డెట్ మార్కెట్‌లో లిస్ట్ అవుతాయి. రెండు విడతల కేటాయింపు తేదీ మే 13, 2025గా ప్రతిపాదించారు. మెచ్యూరిటీ తేదీలు వరుసగా మే 11, 2028, మే 12, 2028.
రెండు నెలల్లో రెండోసారి
ఈ ఏడాది మార్చి 27న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ వంటి సంస్థలకు 2 లక్షల ఎన్‌సీడీలను టాటా మోటార్స్ జారీ చేసింది. ఏడాదికి 7.65 శాతం వడ్డీ ఆఫర్ చేసింది. మొత్తంగా రూ.2,000 కోట్లు సేకరించింది. కాగా, టాటా మోటార్స్ ఇండియా 2023–24లో అప్పుల్లేని కంపెనీగా మారింది. కానీ, తాజాగా రెండు సార్లు ఎన్‌సీడీల జారీ ద్వారా లోన్ తీసుకుంది. ఈ ఏడాది చివర్లో కంపెనీ డీమెర్జర్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు యూకేలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ 2024–-25లో రుణ-రహితంగా మారింది. టాటా మోటార్స్ షేర్లు శుక్రవారం రూ.651.85 వద్ద ముగిశాయి.