
Tata Sons: గత నెలలో గుజరాత్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171 ప్రమాదం ఇప్పటికీ అందరినీ వెంటాడుతోంది. అయితే ప్రమాద బాధితుల కుటుంబాలకు అండగా ఉండేందుకు టాటా గ్రూప్ ఒక ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టాటా సన్స్ బోర్డు రూ.500 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటుకు అంగీకరాం తెలిపినట్లు టాటా గ్రూప్ ప్రతినిధి వెల్లడించారు.
జూన్ 12, 2025న జరిగిన విమాన ప్రమాదం కారణంగా మరణించిన, గాయపడిన లేదా నష్టపోయిన కుటుంబాలకు కొత్తగా ఏర్పాటు చేస్తున్న ట్రస్ట్ ద్వారా సహాయం చేయాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. ఈ క్రమంలో టాటా సన్స్ బోర్డ్ ఎయిర్ ఇండియాను బాధిత కుటుంబాలను సంప్రదించి వారి వివరాలను, అధికారిక ధృవీకరణ పత్రాలను సేకరించాలని కోరింది.
భారత విమానయాన రంగంలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 క్రాష్ ప్రమాదంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ప్రమాద సమయంలో ఉన్నారు. అయితే ఇందులో 241 మంది ప్రాణాలు కోల్పోగా.. కేవలం ఒక వ్యక్తి మాత్రమే బతికి బయటపడ్డాడు. ఇదే క్రమంలో క్రాష్ అయిన ప్రాంతంలో మరో 19 మంది ప్రాణాలను కోల్పోయినట్లు వెల్లడైంది. అలాగే 60 మంది వరకు విమాన్ కూలిన ప్రాంతం చుట్టుపక్కల గాయపడ్డారు. విమానం కూలినప్పుడు 15 వందల డిగ్రీల వరకు మంటలు రావటంతో మృతుల డీఎన్ఏ సేకరించటం పరీక్షించటం కూడా కష్టంగా మారింది.
ప్రస్తుతం టాటాలు ఏర్పాటు చేస్తున్న ట్రస్టులో రూ.300 కోట్లను మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కోసం అందించాలని నిర్ణయించారు. అలాగే మరో రూ.50 కోట్లను ప్రమాదం వల్ల గాయాలైన వారికి, వారి చికిత్సకు ఉపయోగిస్తారు. ఇక మరో రూ.50 కోట్లను ప్రమాదంలో ధ్వంసమైన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బ్లాక్ తిరిగి నిర్మించేందుకు ఉపయోగించనున్నారు. ఇక చివరిగా మిగిలే రూ.100 కోట్లను ప్రమాద బాధితుల కుటుంబాల దీర్ఘకాలిక అవసరాల కోసం ఉపయోగించేందుకు కేటాయించనున్నట్లు వెల్లడైంది.
కొత్తగా ఏర్పాటు చేయనున్న ట్రస్ట్ ప్రక్రియ జూలై నెలాఖరు నాటికి పూర్తవుతుందని సమాచారం. ఈ పబ్లిక్ చారిటీ ట్రస్ట్ బాధ్యతలను ప్రధానంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చూడనున్నారు. ఆయనకు తోడు టాటా గ్రూప్ కి సంబంధం లేని వ్యక్తులు కూడా ఉండనున్నారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా ప్రమాద బాధితులకు రూ.కోటి 25 లక్షలు పరిహారంగా అందించనున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో ముంబై తాజ్ హోటల్ పై తీవ్రవాదులు దాడిచేసిన సమయంలో మరణించిన వారికి సహాయం చేసేందుకు కూడా ఇలానే ట్రస్ట్ ను డిసెంబర్ 2008లో స్థాపించిన సంగతి తెలిసిందే.