
11.4 శాతం వాటా అమ్మనున్న టాటా మోటార్స్
న్యూఢిల్లీ: టాటా టెక్నాలజీస్ ఐపీఓ ఈ నెల 22 న ఓపెనై 24న ముగియనుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో సుమారు 6,08,50,278 షేర్లను కంపెనీ అమ్మాలని చూస్తోంది. ఇది టాటా టెక్నాలజీస్‌లో 15 శాతానికి సమానం. పేరెంట్ కంపెనీ టాటా మోటార్స్ 11.4 శాతం వాటాను అమ్ముతుండగా, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ 2.4 శాతం వాటాను సేల్ చేస్తోంది. టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1 మరో 1.2 శాతం వాటాను విక్రయిస్తోంది. టాటా టెక్నాలజీస్‌లో 9.9 శాతం వాటాను టీపీజీ రైజ్ క్లైయిమేట్‌కు రూ.1,613.7 కోట్లకు అమ్ముతామని కిందటి నెలలో టాటా మోటార్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. టాటా టెక్నాలజీస్‌కు సంబంధించిన ఐపీఓ పేపర్లను ఈ నెల 13 న రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్, మహారాష్ట్ర దగ్గర ఫైల్ చేసింది. టాటా మోటార్స్ షేర్లు సోమవారం సెషన్‌లో రూ.653 దగ్గర సెటిలయ్యాయి.
ఈ నెల 21 న ఐఆర్‌ఈడీఏ ఐపీఓ..
ప్రభుత్వ కంపెనీ ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ) ఐపీఓ ఈ నెల 21 న ఓపెనవుతోంది. 23 న ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 2,150 కోట్లు సేకరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం పబ్లిక్ ఇష్యూ ఈ నెల 20 న ఓపెన్‌లో ఉంటుందని ఐఆర్‌ఈడీఏ వెల్లడించింది. ఐపీఓలో ఫ్రెష్‌గా ఇష్యూ చేసిన 40.31 కోట్ల షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద మరో 26.88 కోట్ల షేర్లను అమ్మనున్నారు.
కిందటేడాది మే లో వచ్చిన ఎల్‌ఐసీ ఐపీఓ తర్వాత ఇన్వెస్టర్ల ముందుకొచ్చిన మొదటి ప్రభుత్వ కంపెనీ ఐఆర్‌ఈడీఏనే.