
- డీఎస్‌ఆర్ గ్రూప్ కంపెనీలు సహా 27 ప్రాంతాల్లో తనిఖీలు
- రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో భారీగా అక్రమాలు
- ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు
- చేసినట్టు గుర్తింపు హార్డ్ డిస్క్‌లు, ఆడిట్
- రికార్డులు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి భాగస్వామిగా ఉన్న డీఎస్‌ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఐటీ నజర్ పెట్టింది. ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించి మంగళవారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రంజిత్ రెడ్డి ఇంట్లో, డీఎస్‌ఆర్ సంస్థ సీఈవో సత్యనారాయణరెడ్డి, ఎండీ సుధాకర్‌రెడ్డి, ఈడీ ప్రభాకర్‌రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్‌ఆర్‌నగర్, సూరారంతో పాటు బెంగళూరులో కలిపి మొత్తం 27 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. సీఆర్‌పీఎఫ్ భద్రత నడుమ కంపెనీల ఆఫీసుల్లోని హార్డ్ డిస్క్‌లు, ఆడిట్ రికార్డులు స్వాధీనం చేసుకుంది. ఆదాయం, ఐటీ చెల్లింపుల డాక్యుమెంట్లు సీజ్ చేసింది.
డీఎస్‌ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టుల్లో లెక్కల్లో చూపని నగదు లావాదేవీలను వెలికితీయడమే లక్ష్యంగా ఈ సోదాలు చేపట్టినట్టు తెలిసింది. డీఎస్‌ఆర్ స్కైవన్, డీఎస్‌ఆర్ వరల్డ్ వెంచర్స్ వంటి ప్రాజెక్టుల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఐటీ గుర్తించి నట్టు సమాచారం. ఎస్‌ఎఫ్‌టీ రూ.12 వేల నుంచి రూ.13 వేల చొప్పున ఫ్లాట్ విక్రయిస్తున్నప్పటికీ.. రిజిస్ట్రేషన్లలో మాత్రం రూ.7 వేలకు విక్రయించినట్టు చూపారని అధికారులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఆ మొత్తాన్ని నగదు రూపంలో సేకరిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. లెక్కల్లో చూప కుండా నగదు రూపంలో దాచిన డబ్బుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను కూడా ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అదే విధంగా రంజిత్‌రెడ్డికి డీఎస్‌ఆర్ గ్రూపులోని పలు ఇన్‌ఫ్రా సంస్థలతో సహా అనేక కంపెనీలతో సంబంధం ఉన్నట్టు ఆధారాలు సేకరించారు.