
- గత 11 ఏళ్లలో 274 శాతం
- పెరిగిన స్థూల పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ట్యాక్స్ వసూళ్ల కంటే ప్రభుత్వం ఇచ్చే రీఫండ్స్ ఎక్కువగా పెరిగాయని ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఆదివారం పేర్కొంది. గత 11 ఏళ్లలో ఆదాయపు పన్ను రీఫండ్‌లు 474శాతం పెరిగి 2024-–25లో రూ.4.77 లక్షల కోట్లకు చేరాయని, ఇదే టైమ్‌లో స్థూల పన్ను వసూళ్లు 274 శాతం పెరిగాయని వివరించింది. 2013లో 93 రోజులు పట్టిన రీఫండ్ జారీ సమయం 2024లో 17 రోజులకు దిగొచ్చింది. ఇది ఏకంగా 81 శాతం తగ్గుదల. 2013–-14లో (యూపీఏ హయాంలో) రూ.83,008 కోట్ల రీఫండ్‌లు జారీ కాగా, 2024–-25 (ఎన్‌డీఏ 11వ సంవత్సరం) నాటికి ఈ నెంబర్ రూ.4.77 లక్షల కోట్లకు చేరింది.
స్థూల డైరెక్ట్ టాక్స్ వసూళ్లు 2013–14లోని రూ.7.22 లక్షల కోట్ల నుంచి 2024-–25లో రూ.27.03 లక్షల కోట్లకు ఎగిసింది. ఇది 274శాతం పెరుగుదల. ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు 133శాతం పెరిగి, 2013లోని 3.8 కోట్ల నుంచి 2024లో 8.89 కోట్లకు చేరాయి. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆన్‌లైన్ ఫైలింగ్, ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ వంటి వాటితో పన్ను నిర్వహణ మెరుగైంది. దీంతో రీఫండ్‌లు పెరిగాయి. ప్రీ-ఫిల్డ్ రిటర్న్‌లు, రీఫండ్ ఆటోమేషన్, రియల్-టైమ్ టీడీఎస్ సర్దుబాట్లు, ఆన్‌లైన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ వంటివి ఆలస్యాన్ని తగ్గించి, పన్ను చెల్లింపుదారుల అనుభవాన్ని మెరుగుపరిచాయి. స్థూల డైరెక్ట్ టాక్స్‌లలో రీఫండ్‌ల వాటా 2013–-14లో 11.5శాతం ఉంటే 2024–-25లో 17.6శాతానికి పెరిగింది.