
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని.. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తానని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జూలై 24) ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాపై చేసిన వ్యాఖ్యలపై కోర్టుకి వెళ్తానని స్పష్టం చేశారు. భట్టిని బయటపెట్టేందుకు నోటీసులు ఇవ్వలేదని.. పాపం ఆయన నా నోటీసులు పూర్తిగా చదవలేదు అనుకుంటానని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీజేపీ సీరియస్గా తీసుకుంటుందని.. జూబ్లీహిల్స్ బై పోల్ టికెట్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా బీజేపీనే కోరుకుంటున్నారని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మంచి ఫలితం రాబోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైడ్రాతో ఇల్లు కూల్చిన మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూలనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాకు పేదవాడి ఇల్లు కూల్చినప్పుడు కనిపించని మానవత్వం ఫాతిమా కాలేజీ దగ్గర గుర్తు వచ్చిందా..? అని ప్రశ్నించారు.
హైడ్రా ఒక ఫెయిల్యూర్ వ్యవస్థ అని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హైడ్రా ఉంచాలా వద్దా అనేది ఆలోచిస్తామన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని.. హైకమాండ్ పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడటం సరికాదన్ననారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూశారని.. ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు.