టీసీఎస్ షేర్ బైబ్యాక్ డిసెంబర్ 1న ప్రారంభం

టీసీఎస్ షేర్ బైబ్యాక్ డిసెంబర్ 1న ప్రారంభం

న్యూఢిల్లీ : సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతిదారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ. 17 వేల కోట్ల షేర్ బైబ్యాక్ కార్యక్రమం డిసెంబర్ 1న ప్రారంభం కానుంది.  ఇన్వెస్టర్లు తమ షేర్లను ఒక్కొక్కటి రూ. 4,150 చొప్పున కంపెనీకి విక్రయించే బైబ్యాక్ డిసెంబర్ 7న ముగుస్తుందని టీసీఎస్​ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.  ఈ బైబ్యాక్‌లో 4.09 కోట్ల షేర్లను (మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 1.12 శాతం) రూ. 4,150 చొప్పున తిరిగి కొనుగోలు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న వాటాదారుల కోసం ( రూ. 2 లక్షల కంటే తక్కువ పెట్టుబడులు ఉన్న వారికి) ప్రతి 6 షేర్లకు 1 షేరుగా అర్హత నిష్పత్తిగా నిర్ణయించారు.

ఇతర క్వాలిఫైయింగ్ షేర్‌హోల్డర్లకు   నిష్పత్తి ప్రతి 209 షేర్లకు 2 షేర్లుగా నిర్ణయించారు. బైబ్యాక్ వల్ల కంపెనీ లాభదాయకత లేదా ఆదాయాలపై ఎలాంటి ప్రభావమూ చూపే అవకాశం లేదని కంపెనీ భావిస్తోంది. టీసీఎస్​లో  26.45 కోట్ల షేర్లలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2.96 కోట్ల ఈక్విటీ షేర్లను టెండర్ చేయాలని భావిస్తోంది. 

టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న 10,14,172 కోట్ల షేర్లలో 11,358 షేర్లను టెండర్ చేయాలని భావిస్తోంది. మొత్తం బైబ్యాక్ పరిమాణం 4,09,63,855 షేర్లు. అందరు వాటాదారుల నుండి స్పందన 100 శాతం వరకు ఉంటుందని ఊహిస్తే, ప్రమోటర్ల మొత్తం వాటా ఇప్పుడు 72.3 శాతం నుండి 72.41 శాతానికి పెరుగుతుంది.  గత ఏడాది టీసీఎస్ షేరు బైబ్యాక్‌ను నిర్వహించి, ఒక్కొక్క షేరుకు రూ. 4,500 చొప్పున మొత్తం రూ. 18,000 కోట్లు చెల్లించింది.

2020, 2018,  2017లో బైబ్యాక్‌లు చేపట్టి రూ.16 వేల కోట్ల విలువైన షేర్లను కొన్నది.  టీసీఎస్ తన షేర్లను 2017లో మొదటిసారిగా ప్రస్తుత ధర కంటే 18 శాతం ప్రీమియంతో తిరిగి కొనుగోలు చేసింది. దీని తర్వాత జూన్ 2018,  అక్టోబర్ 2020లో వరుసగా 18,  10 శాతం ప్రీమియంతో రూ. 16,000 కోట్ల చొప్పున రెండు బైబ్యాక్‌లు జరిగాయి.