
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పోటీపై స్పష్టత కరువైంది. ఆ రెండు పార్టీలు పోటీ చేస్తాయా లేదా అన్నది ఆ పార్టీ నేతలే చెప్పలేకపోతున్నారు. తాజాగా ఈసీ కూడా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తూ.. ప్రచార కార్యక్రమాలు షురూ చేశాయి. కానీ టీడీపీ, జనసేన మాత్రం పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. కాగా, బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో ఇక్కడ కూడా తమకు పోటీ చేసే అవకాశం వస్తుందని జనసైనికులు, తెలుగు తమ్ముళ్లు భావించారు. ఇటీవల టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణపై ఆ పార్టీల కీలక నేతల భేటీ జరిగింది. బీజేపీ నాయకత్వంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశమై ఉమ్మడి కార్యాచరణ ప్రకటించారు. ఈ మీటింగ్ మొత్తం ఏపీ రాజకీయాల చుట్టే తిరిగిందే తప్ప.. తెలంగాణ ప్రస్తావనే లేదు. దీంతో తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై క్లారిటీ రాలేదు.
టీడీపీ ఓటు బ్యాంకు ఎటువైపో..
గ్రేటర్ హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరితో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలోని టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది. ఆ పార్టీ పోటీపై అనుమానాలు ఉండటంతో ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు పలకాలనే దానిపై టీడీపీ నేతలు డైలమాలో ఉన్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీలో లేకపోవడంతో రాష్ట్రంలో అప్పటి నుంచే ఆ పార్టీ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించి ఆ తర్వాత ఆ పార్టీ నాయకత్వం చేతులెత్తేసింది. దీనికి నిరసనగా అప్పటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ మారారు. సెకండ్ క్యాడర్ నాయకులు కొంతమంది కాంగ్రెస్‌లో.. మరికొందరు ఆయా నియోజకవర్గాల్లో తమకు నచ్చిన పార్టీలకు సహకరించారు. తాజాగా ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్నందున టీడీపీ కార్యకర్తలు ఎలా ముందుకెళ్లాలనే దానిపై అయోమయంలో పడ్డారు.
వ్యూహం ఫలించలే..
జనసేన గత ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి బరిలోకి దిగినా ఆశించిన ఫలితం రాలే దు. 9 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీ ఆశలు వదులుకున్నట్లేనని స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు కనీసం ఎలాంటి ఎన్నికల సన్నాహక కార్యక్రమాలు కూడా చేపట్టకపోవడంతో జనసైనికులు అయోమయంలో పడ్డారు.