టీడీపీ, జనసేనల జెండా సభ ఏ మేరకు ప్రభావం చూపుతుంది...?

టీడీపీ, జనసేనల జెండా సభ ఏ మేరకు ప్రభావం చూపుతుంది...?

2024 ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీని గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన పార్టీలు స్పీడ్ పెంచుతున్నాయి . బుధవారం తాడేపల్లిగూడెంలో జరిగిన ఉమ్మడి సభ ద్వారా ఇరుపార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వ్యక్తిగత అభిప్రాయాలు పక్కనపెట్టి టీడీపీ,జనసేన కూటమి గెలుపు కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత ఇరుపార్టీల్లో అసమ్మతి సెగ భగ్గుమంటున్న వేళ ఈ జెండా సభ పొత్తుపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది అన్న చర్చ మొదలైంది.

సభ ప్రారంభంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు జెండాలు మార్చుకోవటం హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు టీడీపీ, జనసేనలది విన్నింగ్ టీమ్ అని, వైసీపీది చీటింగ్ టీమ్ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. రాష్ట్ర ప్రజల బాగు కోసమే టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నాయని స్పష్టం చేశారు. ఈ కలయిక చారిత్రాత్మక అవసరం అని అన్నారు.

ALSO READ : రేపటి(మార్చి 1) నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. జనసేన బలం ఏంటో తెలియదని, బలి చక్రవర్తిని వామనుడు తొక్కినట్టు జగన్ ని అదః పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని, తన పార్టీ జనసేన కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ప్రసంగం ఆద్యంతం జగన్ పై వ్యక్తిగత విమర్శలతో రెచ్చిపోయారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా టీడీపీ,జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టో గురించి కానీ, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ ప్రజలకు వివరించటంలో విఫలమయ్యారు బాబు, పవన్. ఉమ్మడి సభ ద్వారా కార్యకర్తలను అన్నికలకు ప్రిపేర్ చేస్తే సరిపోతుందని అనుకుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పప్పులో కాలేసినట్లే అవుతుంది.