- టాయిలెట్ కోసం వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడన్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడు, టీడీపీ నేత తాటిక నారాయణరావు(62) చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి నిందితుడిని కోర్టుకు తరలిస్తుండగా మూత్ర విసర్జన కోసం వెళ్లి చెరువులో దూకేశాడు. చెరువులో దూకి గల్లంతైన నిందితుడి కోసం పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలించగా.. గురువారం ఉదయం అతని మృతదేహం లభ్యమైంది.
నిందితుడు బాలికను తోటలోకి తీసుకెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంగళవారం రాత్రి స్థానికులు నారాయణరావును పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నారాయణరావును అరెస్ట్ చేసిన పోలీసులు..బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు తమ వైహికల్స్ లో బయలుదేరారు.
అయితే, తుని పట్టణ శివారులోని కోమటి చెరువు వద్దకు రాగానే టాయిలెట్ కు వెళ్తానని నారాయణరావు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. టాయిలెట్ కని వెళ్లి నిందితుడు చెరువులో దూకేశాడని వివరించారు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీశామని పోలీసులు పేర్కొన్నారు
