షురూ కాని సైకిల్‌‌‌‌ సవారీ.. షెడ్యూల్​ వచ్చినా సందిగ్ధంలోనే టీడీపీ

షురూ కాని సైకిల్‌‌‌‌ సవారీ.. షెడ్యూల్​ వచ్చినా సందిగ్ధంలోనే టీడీపీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ వచ్చిన నాటి నుంచి అన్ని రాజకీయ పార్టీల్లో హడావిడి కొనసాగుతుండగా తెలుగుదేశం పార్టీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నిన్న మొన్నటి వరకు నిరసనలకు పరిమితమైన ఆ పార్టీ.. ప్రచారంలో ఎలా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతోంది. పార్టీ అధినేత అరెస్ట్‌‌‌‌ అయి జైలుపాలవడంతో ఆ పార్టీలో స్థబ్ధత నెలకొంది. వచ్చే ఎన్నికల కోసం రాష్ట్ర నాయకత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్టాండ్‌‌‌‌ తీసుకోక పోవడంతో పార్టీలో 
డైలమా కొనసాగుతోంది. 

నేటికీ అభ్యర్థుల జాబితా తేల్చలే..

పార్టీ పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను తేల్చేందుకు ప్రత్యేక  కమిటీని వేసినా ఇప్పటి వరకు టీడీపీ పోటీ చేసే స్థానాలపై కానీ, అభ్యర్థుల కేటాయింపుపై కానీ స్పష్టత రాలేదు. చంద్రబాబు గత ఆగస్టు నెలలో హైదరాబాద్‌‌‌‌లో ఉన్న సమయంలో మొదట 30 నుంచి 40 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌‌‌‌ పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. 

అయితే కాసాని రూపొందించిన జాబితాలో14 మందికి పైగా ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల పేర్లే ఉండగా దాన్ని చంద్రబాబు తిరస్కరించినట్లు తెలిసింది. కంభంపాటి రాం మోహన్‌‌‌‌రావు, రావుల చంద్రశేఖర్‌‌‌‌ రెడ్డి, ఇతర సభ్యులతో ఒక ప్రత్యేక ఎన్నికల కమిటీని నియమించారు. ఈ కమిటీ కూడా ఏమీ తేల్చలేకపోయింది. 

ప్రత్యేక రాష్ట్రంలో పార్టీ పరిస్థితి..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆంధ్రా పార్టీ అని విమర్శలు ఎదుర్కొన్న టీడీపీ 15 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. పలు నియోజకవర్గాల్లో రెండోస్థానంలో నిలిచి రాజకీయ పార్టీలతో పాటు తెలంగాణ వాదులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు మినహా మిగతా వారంతా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్వ ఖమ్మం జిల్లాలోని రెండు నియోజకవర్గాలను గెలుచుకుంది. వారూ  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరిపోయారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. 

నేటికీ వీడని సందిగ్ధం..

బస్సుయాత్ర చేపట్టడానికి రాష్ట్ర నాయకత్వం ప్లాన్‌‌‌‌ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీ ప్రచారానికి తెరలేపాలని నిర్ణయించింది. అయితే దీనిపై ఆపార్టీ అధినేత చంద్రబాబు అభ్యంతరం చెప్పడంతో నిలిచిపోయింది. ముందు పార్టీ పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించిన తరువాతే బస్సుయాత్ర చేపట్టాలని ఆదేశించారు. 

ఆ తరువాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబు అరెస్టు కావడంతో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలన్నింటికీ బ్రేక్‌‌‌‌ పడింది. అప్పటి నుంచి నాలుగైదు రోజుల క్రితం వరకు కేవలం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు, కొవ్వత్తుల ర్యాలీలు, ప్లేట్లు వాయిస్తూ నిరసలు తెలిపారు. ఒక రోజు నిరాహార దీక్షను చేపట్టారు. కానీ పార్టీ ఎన్నికల కార్యక్రమాలపై ఎలాంటి దృష్టి పెట్టలేదు.