టీడీపీ మద్దతు ఏ పార్టీకి..?.. నేటికీ స్పష్టత ఇవ్వని అధిష్టానం

టీడీపీ మద్దతు ఏ పార్టీకి..?.. నేటికీ స్పష్టత ఇవ్వని అధిష్టానం
  • ఓటు ఎవరికి వేయాలో తెలియని డైలమాలో పార్టీ క్యాడర్‌


హైదరాబాద్‌‌, వెలుగు :
తెలుగుదేశం పార్టీ క్యాడర్‌‌ ఏ పార్టీకి ఓటేయాలో తెలియని డైలమాలో ఉన్నారు. పార్టీ అధిష్టానం నేటికీ ఎవరికి మద్దతు ఇవ్వాలో స్పష్టం చేయలేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు  బెయిల్‌‌ రావడంతో రాష్ట్రంలో జరిగే  ఎన్నికల్లో టీడీపీ ప్రభావంపై చర్చ జరుగుతోంది. ఈనెల 28 వరకు చంద్రబాబు ఆంక్షలతో కూడిన బెయిల్‌‌ పై ఉండడంతో.. ఇన్నాళ్లు ఆయన పొలిటికల్‌‌ ప్రకటనలకు దూరంగా ఉన్నారు. 29వ తేదీ నుంచి కండీషన్ లేని బెయిల్‌‌ లభించడంతో తెలంగాణలో ఎన్నికలపై అటెన్షన్‌‌ పెరగనుంది. తెలంగాణలో ప్రచారం 28తోనే ముగియనుంది. అయితే, ప్రచారం ముగిసినా ప్రకటనల ద్వారానైనా టీడీపీ  తమ మద్దతును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జనసేనకు మద్దతు లభించేనా?

తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా 8 మంది అభ్యర్థులను రంగంలోకి దించింది. అయితే, ఏపీలో  టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు తెలంగాణ ఎన్నికల్లో మద్దతు తెలుపుతుందా? లేదా? అనే  డైలమా నేటికీ వీడలేదు. ఇప్పటి వరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  లోకేశ్​ జనసేనకు మద్దతు  ప్రకటించలేదు. తాజాగా చంద్రబాబుకు బెయిల్‌‌ మంజూరైన నేపథ్యంలో విధానపరమైన నిర్ణయం ఉంటుందా? లేదా? అనేది అంతుపట్టకుండా ఉంది. ఇక్కడ బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జనసేనకు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో రాష్ట్రంలో జనసేనకు టీడీపీ మద్దతు లభించే అవకాశాలు లేనట్టేనని స్పష్టమవుతోంది.

కొనసాగుతున్న సస్పెన్స్​..

రాష్ట్రంలో పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనేదానిపై నేటికీ సస్పెన్స్‌‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు పోటీకి దూరంగా ఉన్నట్లు ప్రకటన కూడా చేయని తెలుగుదేశం.. కనీసం ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనేది కూడా ప్రకటించలేదు. అయితే, ఇన్నాళ్లు చంద్రబాబు అరెస్టు, జైలు, కండీషన్‌‌ బెయిల్‌‌ వంటి వ్యవహారాల నేపథ్యంలో ఎవరికి మద్దతు ప్రకటించకపోయినా.. అంతా నడిచిపోయింది.  కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంతో  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకో ఒక పార్టీకి మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌తో పాటు ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాల్లో బలమైన ఓటు బ్యాంకు  ఉన్న టీడీపీ ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపనుంది.