- అప్లై చేసుకోవడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉండగానే సిటీ చుట్టూ సెంటర్లన్నీ తీసివేత
- సర్వర్ ప్రాబ్లమ్, నెట్ సెంటర్లలో రష్ తో చివరి వరకూ ఆగిన అభ్యర్థులు
- ఇప్పటికే 4 లక్షల అప్లికేషన్లు.. ఇంకా లక్ష మంది ఉండొచ్చని అంచనా
- సొంత జిల్లాలో ఎగ్జామ్ రాయలేకపోతున్న కొందరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణ గందరగోళంగా మారింది. ఎంత మంది టెట్ రాస్తారన్న అంచనా లేకపోవడం, ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటుపై హడావుడి నిర్ణయాల కారణంగా అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. అప్లై చేసుకోవడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉండగానే హైదరాబాద్ సహా చుట్టుపక్కలున్న జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లను ఎంపిక చేసుకునేందుకు అవకాశమివ్వకుండా ఆఫీసర్లు బ్లాక్ చేశారు.
2017 జులైలో నిర్వహించిన టెట్‌కు సుమారు 3.5 లక్షల మంది హాజరయ్యారు. ఈసారి 5 లక్షల మంది అప్లై చేసుకునే అవకాశముంది. ఇప్పటికే 4 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అభ్యర్థులు పెరుగుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది అప్లై చేస్తుండటంతో నిర్వహణపై అయోమయం నెలకొన్నది. ఇప్పటికీ చాలా జిల్లాల్లో సెంటర్లు ఫైనల్ కాలేదు. ఇటీవల డీఈఓల మీటింగ్‌లోనూ ఇదే విషయంపై చర్చ జరిగింది.
సెంటర్ల లిస్టు నుంచి జిల్లాల తొలగింపు
రాష్ట్రంలో జూన్ 12న టెట్ నిర్వహించాల్సి ఉంది. మార్చి 26 నుంచి ఈ నెల12 వరకు దరఖాస్తులకు టైమ్ ఇచ్చారు. సర్వర్ ప్రాబ్లమ్, నెట్ సెంటర్లలో రష్ ఉండటంతో చివర్లో అప్లై చేద్దామని చాలామంది భావించారు. గతంలో ఉమ్మడి పది జిల్లాల్లో సెంటర్లు ఉండగా, ఈ సారి అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లోనూ సెంటర్లు పెడ్తామని సర్కారు ప్రకటించింది. అయితే శనివారం నాటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్‌తోపాటు పలు జిల్లాలను సెంటర్ల లిస్టు నుంచి తీసేశారు. దీంతో ఆయా జిల్లాల అభ్యర్థులు సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు, వికలాంగులకు దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాయడం ఇబ్బందిగా మారింది. రెండు పేపర్లు రాయాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది. సెంటర్ల తీసివేతపై సమాచారం ఇస్తే.. ముందే అప్లై చేసుకునే వాళ్లమని వాపోతున్నారు. గతంలో జరిగిన టెట్‌కు మొత్తం అభ్యర్థుల్లో సగం మంది హైదరాబాద్‌లోనే పరీక్ష రాశారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడెందుకు బ్లాక్ చేశారని ప్రశ్నిస్తున్నారు. సిటీ చుట్టూ అనేక ఇంజినీరింగ్, ఇతర కాలేజీలున్నాయని, గతంలో మాదిరి ఎక్కువ సంఖ్యలో ఎంగేజ్ చేసుకుని పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇప్పటికే ఫీజు చెల్లించి అప్లికేషన్ పూర్తి చేయని వాళ్లు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పరీక్ష రాసే పరిస్థితి కన్పించడం లేదని చెప్తున్నారు.
‘హెల్ప్’ చేయని సెంటర్లు
టెట్ అప్లికేషన్ల సందర్భంలో, ఇతర సమాచారం కోసం విద్యాశాఖ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. హెల్ప్ డెస్క్, టెట్ ఆఫీసు, సీజీజీ– టెక్నికల్ ఇష్యూస్ కోసం వేర్వేరుగా ఫోన్ నెంబర్లు ఇచ్చారు. తొలి రెండు రోజులు బాగానే సమాధానమిచ్చిన సిబ్బంది.. ఆ తర్వాత సరిగా ఫోన్లు తీయడం లేదు. కొన్ని ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. హెల్ప్ డెస్క్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించలేదు. ఎస్సీఈఆర్టీలో పనిచేసే కొందరికే ఈ బాధ్యతలు అదనంగా అప్పగించారు. దీంతో అటు ఆఫీస్ పని, ఇటు ఈ కాల్స్ రిసీవ్ చేసుకోవడం వీరికి కష్టంగా మారింది. మరో వైపు టెట్‌కు సంబంధించి ఏ సమాచారం ఇవ్వడానికి కూడా అధికారులు ఇష్టపడడం లేదు. లోపాలపై ప్రశ్నిస్తే.. తమ వద్ద ఏ సమాచారం లేదని దాటవేస్తున్నారు.
ఎడిట్ ఆప్షన్‌కు నో
టెట్ అప్లికేషన్లలో తప్పుల సవరణకు అధికారులు ససేమిరా అంటున్నారు. చాలామంది అప్లికేషన్లలో టెక్నికల్, టైప్ ఎర్రర్స్ తో పాటు ఫొటోలూ సరిగా రాలేదు. వాటిల్లో తెలియక చేసిన తప్పులే ఎక్కువగా ఉన్నాయి. మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాల్లో సెంటర్ల నిర్వాహకులు అప్లై చేయడంతో తప్పులు దొర్లాయి. వాటిని సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. కాల్ సెంటర్స్‌కు ఈ విషయంపైనే ఎక్కువ కాల్స్ వస్తున్నాయని అంటున్నారు. లాస్ట్ టైమ్ కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదని, ఈసారి కూడా ఇవ్వబోమని అధికారులు తెగేసి చెప్తున్నారు.
