
ప్రధాన అభ్యర్థుల మనోగతం..
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, పీఆర్టీయూ టీఎస్అభ్యర్థి చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి, ఎస్టీయూ అభ్యర్థి భుజంగరావు, బీసీటీఏ అభ్యర్థి విజయకుమార్, టీఎస్టీసీఈఏ అభ్యర్థి సంతోష్ కుమార్, కాంగ్రెస్ మద్దతుతో హర్షవర్ధన్ రెడ్డి, టీపీటీఎఫ్ మద్దతుతో వినయకుమార్ తదితరులు ఉన్నారు. అయితే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. 10 ఏండ్లపాటు ఎమ్మెల్సీగా సేవలందించానని, ఈసారి కూడా తానే గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. పీఆర్టీయూతో పాటు మరో 35 ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతు తనకుందని, తన విజయం నల్లేరుపై నడకేనని చెన్నకేశవరెడ్డి చెప్తున్నారు. సర్కారు సపోర్టూ ఉందంటున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచినా.. తాను టీచర్ల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉన్నానని ఈసారి తప్పక విజయం సాధిస్తాననే విశ్వాసంతో యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి ఉన్నారు. ఇంకోపక్క సర్కారుపై టీచర్ల వ్యతిరేకతతో పాటు బీజేపీ మద్దతు ఉండటంతో తప్పక తానే గెలుస్తానని ఏవీఎన్ రెడ్డి అంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఓట్లు తనకు పడ్తాయని ఆయన భావిస్తున్నారు. సర్కారుపై టీచర్లలో ఉన్న వ్యతిరేకతే తమకు ఓట్లు పడేలా చేస్తుందని మిగతా అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
739 పోలింగ్ అధికారులు, సిబ్బంది
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 739 పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కొక్కరు చొప్పున 137 మంది పీఓలు, 137 మంది ఏపీఓలు, 319 ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 593 మంది సిబ్బందిని నియమించగా, దాంట్లో 146 మందిని రిజర్వులో పెట్టారు. టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా తెలిపారు. జీహెచ్ఎంసీ మెయిన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఆదివారం ఆమె పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు జారీచేశారు. స్టాచుచరీ, నాన్ స్టాచుచరీ పత్రాలతో పాటు బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్స్, ఓటరు జాబితాను ఎన్నికల సిబ్బంది చెక్చేసుకోవాలని సూచించారు.