
- విద్యకు ప్రాధాన్యమివ్వాలె
- ఖాళీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
హైదరాబాద్, వెలుగు : కొత్త ప్రభుత్వం రాష్ట్ర విద్యారంగాన్ని సమీక్షించి, మార్పులు తీసుకురావాలని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. విద్యారంగంలో సౌలతుల ఏర్పాటుతోపాటు టీచర్ల సంక్షేమంపై ఫోకస్ పెట్టాలన్నారు. ఆదివారం హైదరాబాద్లో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ జంగయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, పర్యవేక్షణ వ్యవస్థను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వం పదేండ్లు పాలించినా సర్వీస్ అసోసియేషన్లకు గుర్తింపు ప్రక్రియను కానీ, సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయలేదన్నారు. కొత్త ప్రభుత్వమైనా నిబంధనలకు అనుగుణంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, తదితరులు పాల్గొన్నారు.