పిల్లలతో కలిసి ప్రగతి భవన్ ముట్టడించిన టీచర్లు

పిల్లలతో కలిసి ప్రగతి భవన్ ముట్టడించిన టీచర్లు

హైదరాబాద్, వెలుగు: భార్యాభర్తలకు ఒకే దగ్గర పోస్టింగ్ ఇస్తామని సీఎం చెప్పి ఏండ్లు గడుస్తున్నా ఆ హామీని నెరవేర్చలేదని ప్రభుత్వ టీచర్లు ఆరోపించారు. ఒకే దగ్గర పనిచేసుకునే వెసులబాటు ఇవ్వాలని కోరుతూ సుమారు 50 మంది టీచర్లు తమ పిల్లలతో కలిసి ప్రగతి భవన్ ను శనివారం ముట్టడించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పోలీసుల కాళ్లు మొక్కిన్రు

ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన టీచర్లు తమతోపాటు చిన్న పిల్లలను వెంట తీసుకొచ్చారు. దీంతో టీచర్లను అరెస్టు చేసిన పోలీసులు.. పిల్లలను కూడా డీసీఎంలోకి ఎక్కించారు. ఈ సమయంలో చాలా మంది చిన్నారులు భయపడి ఏడుస్తూ కనిపించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కొందరు టీచర్లు అక్కడున్న పోలీసుల అధికారుల కాళ్లు మొక్కారు. విధి నిర్వహణలో భాగంగా దూర ప్రాంతాలకు ప్రయాణించటం వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పౌస్ బదిలీల వల్ల ప్రభుత్వానికి రూపాయి ఖర్చు కాదని తెలిపారు. 2012, 2016లో జీవోలు ఇచ్చారన్నారు. బదిలీలు చేస్తామని 4 సార్లు  సీఎం ప్రకటన చేశారని, వందల సార్లు మంత్రులకు,అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని జైపాల్ రెడ్డి అనే టీచర్ తెలిపారు. 8 ఏళ్లుగా భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర  పనిచేస్తూ బదిలీల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. మహిళా టీచర్లు కుటుంబాలను కలవక మానసిక ఒత్తిడి, అభద్రతా భావానికి గురవుతున్నారని చెప్పారు. అంతకుముందు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు టీచర్లు వినతిపత్రాలు ఇచ్చారు. కేబినేట్ భేటీలో చర్చించాలని కోరారు.