
ఫుడ్ పాయిజన్ ఘటనపై చింతిస్తున్నామని ట్రిపుల్ ఐటి డైరెక్టర్ సతీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపు 800మంది ఆసుపత్రి పాలయ్యారు. రెండు నెలల క్రితం సౌకర్యాలు కల్పించాలంటూ విద్యార్థులు ఆందోళనబాట పట్టిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ ఈ సంఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటి డైరెక్టర్ సతీష్ కుమార్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం పిల్లలంతా రికవర్ అయ్యారని... ఇకపై ప్రతి మెస్, హస్టల్ కు వార్డెన్ ఉండేలా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రతిరోజూ ఇద్దరు ఉపాధ్యాయులు పిల్లలతో పాటు భోజనం చేసేలా నిబంధన పెడుతున్నామని స్పష్టం చేశారు. మెస్ కమిటీలో విద్యార్థులకు చోటు కల్పించి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. క్యాటరింగ్ ఏజెన్సీపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్న డైరెక్టర్.. షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. సరైన సమాధానం రాకుంటే యూనివర్సిటీ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిల్లల ఆరోగ్యం, చదువే తమకు ముఖ్యమని అన్నారు.
ఇదిలా ఉంటే బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై వారం రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకట రమణ ప్రకటించారు. ట్రిపుల్ ఐటీ సెట్ కావడానికి ఇంకాస్త టైం పడుతుందన్న ఆయన.. స్టూడెంట్స్ అందరూ సేఫ్ గా ఉన్నారని, ఇకపై విద్యార్థుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. సోమవారం నుండి ట్రిపుల్ ఐటీలో కొత్త మార్పులు గమనిస్తారన్న వైస్ చైర్మన్ వెంకట రమణ.. ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.