
- గందరగోళంగా కేడర్ విభజన
- ఇష్టమున్నట్లు లిస్టులు, అలాట్మెంట్లు, పోస్టింగ్‌లు
- ఒక్కో చోట ఒక్కో రకంగా సీనియారిటీ
- స్థానికతను పట్టించుకోకుండా కేటాయింపులు
- ప్రస్తుత విధానంతో నిరుద్యోగులకూ జాబులు కష్టమే
- జీవో రద్దు కోసం ఉద్యోగులు, టీచర్ల ఆందోళనలు
ఓ వైపు సీనియారిటీపై గందరగోళం.. మరో వైపు లొకాలిటీ కోసం ఆందోళనలు.. ఇంకో వైపు పోస్టింగ్ కౌన్సెలింగ్‌లో లొల్లులు... ఇవీ రాష్ట్రంలో ఎంప్లాయీస్, టీచర్ల అలాట్మెంట్లలో కనిపిస్తున్న సీన్లు. కేడర్ విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 317 వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తమ జీవితాలతో చెలగాటం ఆడేలా ఈ జీవో తెచ్చారని మొదటి నుంచి ఉద్యోగులు, టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు కూడా దీని వల్ల తీరని అన్యాయం జరుగుతున్నదని అంటున్నారు. వెంటనే జీవోను రద్దు చేయాలని కొందరు.. సవరించాలని ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేడర్ విభజన అంతా ఆగమాగంగా నడుస్తున్నది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో ఉద్యోగులు, టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేడర్ విభజన కోసం ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం జీవో 317ను తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి వివాదం ముదురుతూనే ఉంది. స్థానికత అంశమే ఇందులో లేకపోవడం, ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా సీనియారిటీ లిస్టులు ప్రిపేర్ చేయడం, అంతర్ జిల్లా బదిలీలు, స్పౌజ్ కేసులపై క్లారిటీ ఇవ్వకపోవడంపై టీచర్లు, ఎంప్లాయీస్ భగ్గుమంటున్నారు. జీవోలోని అంశాలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని అంటున్నారు. జూనియర్ ఉద్యోగులైతే తాము స్థానికతను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవోను రద్దు చేయాలంటూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలన్నింటితో చర్చించకుండా కేవలం టీజీవో, టీఎన్జీవో సంఘాలతోనే చర్చించి ఇష్టమున్నట్లు గైడ్‌లైన్స్ రూపొందించాలని ఉద్యోగులు మండిపడుతున్నారు. అయితే.. ఇప్పటికే అలాట్మెంట్ ప్రక్రియ పూర్తికాగా, పోస్టింగ్‌ల ప్రాసెస్ కొనసాగుతున్నది.
అలాట్మెంట్లలో సర్కారు అంచనాలు తప్పాయి. రాష్ట్రంలో మొత్తం ఎంప్లాయీస్ దాదాపు 3.40 లక్షల మంది ఉంటే.. వారిలో 16 వేల మందికి మాత్రమే ట్రాన్స్ఫర్లు ఉంటాయని ముందు అంచనా వేసింది. అయితే అందుకు భిన్నంగా ఇప్పటి దాకా ప్రభుత్వ ఉద్యోగుల్లో అన్ని రకాలుగా దాదాపు 40 వేల ఉద్యోగులు ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి ఇంకో జిల్లా, ఇంకో జోన్లకు మారుతున్నట్లు తెలిసింది. టీచర్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం 32 జిల్లాల పరిధిలో 95 వేల మంది టీచర్లు ఉంటే, కేవలం పదివేల మంది వరకే కొత్త జిల్లాలకు వెళ్తారని ముందుగా ప్రభుత్వం భావించింది. కానీ 22,500కు పైగా టీచర్లు కొత్త జిల్లాలకు అలాట్ కావడంతో సమస్య ముదురుతున్నది.
పెరుగుతున్న అప్పీళ్లు
డిస్ట్రిక్ట్ కేడర్ పోస్టుల విభజనతో పాటు జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల అలాట్మెంట్లలోనూ అయోమయం నెలకొంది. పైగా స్పౌజ్, స్పెషల్ కేసుల విషయంలో ఒక్కోచోట ఒక్కోలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఉద్యోగుల విభజనకు కమిటీల చైర్పర్సన్లుగా ఉన్న కలెక్టర్లకు, ఆయా శాఖల ప్రిన్సిపల్సెక్రటరీలకు, హెచ్వోడీలకు వేల సంఖ్యలో అప్పీళ్లు వస్తున్నాయి. అలాట్మెంట్లు తీసుకుని పోస్టింగులకు వెళ్లిన ఉద్యోగులు కూడా అప్పీల్స్పెట్టుకుంటున్నారు. మరోపక్క జోనల్, మల్టీ జోనల్ఉద్యోగులకు అలాట్మెంట్లు పూర్తిగా ఇవ్వకపోయినా.. అప్పుడే తమకు అన్యాయం జరుగుతున్నదని అప్పీల్స్ చేసుకుంటున్నారు. జోనల్, మల్టీ జోనల్ఉద్యోగుల కేటగిరీలు మారి, ఆదిలాబాద్ లొకాలిటికీ చెందిన జోనల్ఉద్యోగి డైరెక్ట్‌గా ములుగు జిల్లాకు బదిలీ అవుతున్నారు. ఇప్పటికే 15 వేల అప్పీల్స్ వచ్చినట్టు ఓ అధికారి చెప్పారు. వెకెన్సీలు చూపెట్టకుండా అలాట్మెంట్లు, పోస్టింగులు ఇస్తుండటంతో కొన్ని జిల్లాల్లో, డిపార్ట్మెంట్లలో ఖాళీలను అటు ఇటు చేస్తున్నారని నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా సీనియర్లంతా ఉమ్మడి జిల్లా కేంద్రాలు, పట్టణ జిల్లా కేంద్రాలకు అలాట్ కావడంతో రూరల్ జిల్లాలకు, రూరల్ ఏరియాలకు జూనియర్లు అలాట్ అయ్యారు. జూనియర్ల రిటైర్మెంట్లు ఇప్పట్లో ఉండవని, దీని వల్ల రూరల్ ఏరియాల్లో పోస్టులు ఉండక అక్కడి నిరుద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
అంతా జీఏడీనే..!
ఉద్యోగుల విభజన కేటాయింపు ప్రక్రియ మొత్తం జనరల్ అడ్మినిస్ర్టేషన్ డిపార్ట్ మెంట్ (జీఏడీ) ఆధీనంలో సాగుతున్నది. ఈ ప్రక్రియకు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్‌ను హెడ్ గా నియమించారు. ప్రభుత్వ శాఖల్లో ఏ ఐఏఎస్ లు, ఐపీఎస్ , ఉన్నతాధికారులను కదిలించినా.. ‘‘మాకేం తెలియదు. అంతా జీఏడీ’’ అని సమాధానమిస్తున్నారు.
ఎక్కడికక్కడ ఆందోళనలు
జీవో 317ను సవరించాలని కొన్ని సంఘాలు.. రద్దు చేయాలని ఇంకొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే యూఎస్పీసీ, జాక్టో సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. ఎంప్లాయీస్ కూడా బీఆర్కే భవన్ ఎదుట నిరసన చేపట్టారు. మరోపక్క ఉద్యోగులకు, టీచర్లకు రాజకీయ పార్టీలూ మద్దతిస్తున్నాయి.
గవర్నర్ వద్దకు పంచాయితీ
కేడర్ విభజన పంచాయితీ గవర్నర్ వద్దకు చేరింది. సర్కారు ఇచ్చిన జీవోతో ఆదివాసీ, గిరిజన ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రెండు రోజుల కింద గవర్నర్ తమిళిసైకి బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఫిర్యాదు చేశారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నదని
గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇవీ అభ్యంతరాలు
- సీనియారిటీ లిస్టు పెట్టిన తర్వాతే ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలి.
- 317 జీవోలో స్థానికత అంశమే పేర్కొనలేదు. సీనియారిటీ ప్రామాణికంగానే అలాట్మెంట్లు ఇవ్వడంతో తాము స్థానికేతరులుగా మారుతున్నామని జూనియర్ ఉద్యోగులు అంటున్నారు.
- స్పౌజ్, మెడికల్ గ్రౌండ్ , విడో ఉద్యోగుల అంశాలను ముందుగా పరిగణనలోకి తీసుకోవాలి. కానీ.. కొత్త పోస్ట్ లో జాయిన్ అయిన తర్వాత అప్పీల్ చేసుకోవాలని చెప్తున్నారు. వారిని ఎలా సర్దుబాటు చేస్తారనేది క్లారిటీ లేదు.
- ఏ జిల్లాకు ఏ కేటగిరిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎంతమంది ఉద్యోగులను అక్కడ సర్దుబాటు చేయాలి? ఖాళీలు ఎన్ని ఉన్నాయనే వివరాలను బయటపెట్టట్లేదు.
- ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రోస్టర్ ప్రకారం వారికి కేటాయించిన పోస్టులకు తగ్గట్టుగా విభజన చేపడుతామని జీవోలో పేర్కొన్నారు. అయితే ఒక్కో చోట ఒక్కోలా చేస్తూ వచ్చారు. ఓపెన్ కేటగిరిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను కూడా రిజర్వేషన్ కోటాలో కలిపేశారు.
కేబినెట్ సబ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలే?
ప్రభుత్వం తీసుకునే ఎన్నో నిర్ణయాలకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తుంది. కానీ లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించిన ఈ కేడర్ విభజన అంశంపై మాత్రం కేబినెట్ సబ్ కమిటీని ఎందుకు నియమించలేదు. అన్ని సంఘాల సలహాలు, సూచనలు తీసుకోకుండా.. కేవలం రెండు సంఘాల అభిప్రాయాలు తీసుకోవడం సరికాదు. జీవోను సవరించాలి.
– పద్మాచారి, తెలంగాణ ఉద్యోగ సంఘం , గౌరవ అధ్యక్షుడు
తాత్కాలికంగా బదిలీలు ఆపాలి
ప్రభుత్వం హడావుడిగా చేసిన జిల్లాల బదిలీలను తాత్కాలికంగా ఆపాలి. లేదా వీటిని అడ్ హక్ బదిలీలుగా ప్రకటించాలి. అన్ని టీచర్ల సంఘాలతో చర్చించి, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని జీవోలో అవసరమైన మార్పులు చేయాలి. అప్పీళ్లను పరిష్కరించి, ఎవరికీ నష్టం జరగకుండా చూడాలి. లేకపోతే దశల వారి పోరాటాలకు సిద్ధమవుతాం.
- చావ రవి, యూటీఎఫ్ స్టేట్ సెక్రెటరీ