- ప్రభుత్వ టీచర్లకు ఒకేసారి రెండు డ్యూటీలు
- తలకు మించిన భారమంటున్న ఉపాధ్యాయులు
- రెండూ చేయాలంటున్నఅధికారులు
మహబూబాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనికి అనుగుణంగా అన్ని జిల్లాల్లో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నెల 11 నుంచే ప్రభుత్వ టీచర్లు రాష్ట్రవ్యాప్తంగా జనగణన కోసం గృహ గుర్తింపు నంబరింగ్ చేపట్టాల్సి ఉంది. ఒకే రోజు నుంచి రెండు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభమవడంతో టీచర్లు అయోమయానికి గురవుతున్నారు. ఒకేసారి రెండు పనులు ఎలా చేయాలని తలలు పట్టుకుంటున్నారు.
టీచర్లకు జనగణన డ్యూటీలు కేటాయించిన ప్రాంతాల్లోనే విద్యా వారోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీచర్లు విద్యా వారోత్సవాల్లో పాల్గొంటూనే మిగిలిన సమయంలో జనగణన ప్రక్రియను కూడా చేపట్టాలని మహబూబాబాద్ జిల్లా డీఈవో సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రెండు కార్యక్రమాల విజయవంతానికి టీచర్లు కృషి చేయాలని కోరారు.
