
- తమ పిల్లలను సర్కారు బడులకే పంపుతున్న పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు
- వీరిని చూసి తమ వైఖరి మార్చుకుంటున్న తల్లిదండ్రులు
వెలుగు, నెట్వర్క్: ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లలను సర్కారు బడుల్లో చదివించినప్పుడే ఉచిత విద్యపై ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందని విద్యావేత్తలు, ఆలోచనాపరులు తరుచూ చెప్తుంటారు. కానీ చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కారు బడుల్లో కాకుండా ప్రైవేట్, కార్పొరేట్స్కూళ్లలో చేర్పిస్తుంటారు. దీంతో వాళ్లు చెప్పే చదువులపై వాళ్లకే నమ్మకం లేదంటూ పేదలు సైతం అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కారు బడులకే పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరైతే తాము చదువు చెప్పే పాఠశాలలోనే పిల్లల్ని చేర్పించి, రోజూ తమతో పాటే తీసుకెళ్తున్నారు. ఇలాంటి టీచర్లను చూసి తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వస్తోంది. ఆయా చోట్ల పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్‌స్కూళ్లలో మాన్పించి, సర్కారు బడుల్లో చేరుస్తుండడంతో ఒకప్పుడు వెలవెలబోయిన పాఠశాలలు కాస్తా ఇప్పుడు కళకళలాడుతున్నాయి. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అలాంటి ఆదర్శ ఉపాధ్యాయులపై స్పెషల్ స్టోరీ.
ఈయన పేరు వేల్పుల జాకోబు రాజాకుమార్
ఇతడు సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం చెట్లముకుందాపురం గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో ఎస్‌జీటీగా పనిచేస్తున్నారు. మూడో తరగతి చదువుతున్న తన కుమార్తె ఎలిజిబెత్ అమూల్యను తాను పనిచేస్తున్న స్కూల్‌లోనే చేర్పించారు. తాము పనిచేస్తున్న బడిలోనే తమ పిల్లలను సైతం చేర్పించడంతో గ్రామస్తుల్లో నమ్మకం పెరిగి వారి పిల్లలను ప్రభుత్వ స్కూల్‌లోనే చేర్పిస్తున్నారని రాజాకుమార్ తెలిపారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం హైస్కూల్‌లో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న రాజమల్లుకు అయిదుగురు పిల్లలు. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతుండగా.. కవల పిల్లలైన శ్రీరామ్ తేజ, శ్రీశివతేజ బెజ్జంకి జడ్పీహెచ్ఎస్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. సర్కార్ స్కూల్‌లోనే మంచి విద్య అందుతున్న ఉద్దేశంతోనే తన పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లోనే చదివించినట్లు టీచర్ రాజమల్లు తెలిపారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న తండ్రి, బిడ్డ గోదారి ప్రశాంత్, సాత్విక. ప్రశాంత్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం జడ్పీ హైస్కూల్‌లో చదువుకొని గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించారు. ఆయన ప్రస్తుతం మెట్‌పల్లిలో పనిచేస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న తన కూతురు సాత్వికను సైతం తాను చదువుకున్న కేశవపట్నం సర్కార్ స్కూల్‌లోనే జాయిన్ చేశాడు. గవర్నమెంట్ స్కూల్స్‌పై ఉన్న నమ్మకంతోనే తన కూతురిని అక్కడ చదివిస్తున్నట్లు ప్రశాంత్ తెలిపారు.
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వాసం రాజమణి మాదాపూర్ ఎంపీపీఎస్‌లో ఎస్‌జీటీగా పనిచేస్తోంది. కుమారుడు హిమాన్ష్‌ను తాను పనిచేస్తున్న స్కూల్‌లోనే మూడో తరగతి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసింది. ప్రతి రోజు తనతో పాటే స్కూల్‌కు తీసుకొస్తుంది. సర్కార్ స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు నైపుణ్యం, అర్హత కలిగిన టీచర్లు ఉంటారని చెప్పారు. అందుకే తన కుమారుడిని సర్కార్ స్కూల్‌లోనే జాయిన్ చేసినట్లు చెప్పారు.
ఈ టీచర్ పేరు కంభంపాటి వెంకటేశ్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌లో మ్యాథ్స్ ఉపపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన కుమారుడు విహాన్ మూడో తరగతి, పాప స్నిగ్ధ రెండో తరగతి చదువుతున్నారు. సర్కార్ స్కూళ్లలోనే నాణ్యమైన విద్య అందుతుందని, అందుకే తమ ఇద్దరు పిల్లలను సత్తుపల్లి ఎన్‌టీఆర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నానని వెంకటేశ్ చెప్పారు. సర్కార్ స్కూల్స్‌లోనే అనేక సౌకర్యాలు ఉంటాయని, అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారన్నారు.
భూపతి కుమార్ అనే టీచర్ ఉప్పునుంతల మండలంలోని మర్రిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలు మూడోతరగతి చదువుతున్న కనిష్క్, రెండో తరగతి చదువుతున్న కౌశిక్‌ను తాను పనిచేస్తున్న స్కూల్‌లోనే జాయిన్ చేశారు. ప్రతి రోజు తన వెంటే స్కూల్‌కు తీసుకొచ్చి, తిరిగి తీసుకొని వెళ్తున్నట్లు కుమార్ తెలిపారు.
సూర్యాపేట జిల్లా వెంపటి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న మల్లెపాక రవీందర్ తన ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల మీద ప్రజలకు నమ్మకం కల్పించాలన్న ఉద్దేశంతోనే తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసినట్లు టీచర్ రవీందర్ తెలిపారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన బాణావత్ ప్రకాశ్‌నాయక్, కాంత దంపతులు ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్నారు. ప్రకాశ్ నాయక్ కిష్టాపూర్ గవర్నమెంట్ హైస్కూల్‌లో, కాంత మండల కేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడు సాత్విక్ నాయక్ కిష్టాపూర్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. వీరి కూతురు శ్రీనిధి సైతం సర్కార్ స్కూల్‌లోనే టెన్త్ పూర్తి చేసింది. సమాజంలో కొంతైనా మార్పు తేవాలని, అన్ని సౌకర్యాలు ఉన్న సర్కార్ స్కూళ్లలోనే పిల్లలను చదివించాలన్న ఉద్దేశంతోనే తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తున్నామని దంపతులు తెలిపారు.
గాజుల వెంకటేశ్ నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని బాలుర ప్రాథమిక పాఠశాలలో గణితం, ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నాడు. తన ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన గౌతమ్ అచ్చంపేట ప్రభుత్వ స్కూల్‌లో చదివిస్తుండగా.. చిన్నకుమారుడు రాహుల్‌ను తాను పనిచేస్తున్న స్కూల్‌లోనే జాయిన్ చేశాడు.