
- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు మౌన దీక్ష
- అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం.. టీచర్ల అరెస్ట్
- తల్లిదండ్రులతో పాటు పిల్లలనూ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
- మీరు టీచర్లా, రౌడీలా? స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన కామెంట్లు
హైదరాబాద్, వెలుగు: టీచర్ల స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. స్పౌజ్ బదిలీలు చేపట్టాలని కోరుతూ టీచర్ దంపతులు, పిల్లలతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. భార్యాభర్తలు ఒకేచోట ఉద్యోగం చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 13 జిల్లాల్లో బ్లాక్ చేసిన స్పౌజ్ బదిలీలు చేపట్టాలని కోరుతూ శనివారం లక్డీకాపూల్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌ను టీచర్లు ముట్టడించారు. తమ ఆవేదనను సర్కారుకు తెలిపేందుకు మౌన దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి మాటే ముద్దు.. దంపతులు విడిగా వద్దు..’, ‘దంపతుల్ని కలపండి.. సీఎం మాటను నిలపండి’అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. భర్త ఒక జిల్లాలో, భార్య మరో జిల్లాలో విధులు నిర్వహించడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ల ఆందోళన నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫీసు ముందు పోలీసులు భారీగా మోహరించారు. చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ అయింది. నిరసనకు పర్మిషన్ లేదని పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, టీచర్లు ప్రతిఘటించారు. ఈ క్రమంలో పోలీసులకు, టీచర్లకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పలువురు టీచర్లపై పోలీసులు చేయి చేసుకున్నారు. టీచర్ల పిల్లలు ఏడుస్తున్నా పోలీసులు పట్టించుకోకుండా అరెస్టు చేశారు. కొందరు మహిళా పోలీసులు మాత్రం చిన్నారులను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. అరెస్టు చేసిన వారిని ముషీరాబాద్, నాంపల్లి, గాంధీనగర్, బేగంబజార్, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్, రాంగోపాల్ పేట, సైఫాబాద్ తదితర స్టేషన్లకు తరలించారు. పోలీసుల తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు వివిధ జిల్లాల నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌కు చేరుకున్న టీచర్లను పోలీసులు ఉదయమే అదుపులోకి తీసుకున్నారు.
అప్లయ్ చేసుకున్న అందరినీ ట్రాన్స్‌ఫర్ చేయాలె..
అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని స్పౌజ్ ఫోరం నాయకులు వివేక్, నరేశ్, మమత విజ్ఞప్తి చేశారు. జీవో 317 ద్వారా 19 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టి, 13 జిల్లాలను బ్లాక్ చేయడం సరికాదన్నారు. ఈ జిల్లాల్లో 2,100 మంది స్పౌజ్ టీచర్లు ఉన్నారన్నారు. వీరిలో కేవలం 615 మందికి మాత్రమే బదిలీలకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారని, మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దరఖాస్తు చేసుకున్న అందరినీ ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరారు. కాగా, మౌన దీక్ష చేపట్టిన స్పౌజ్ టీచర్లపై పోలీసుల తీరును టీచర్ల సంఘాలు తప్పుబట్టాయి. టీచర్ల అరెస్టును ఉపాధ్యాయ సం ఘాల నాయకులు ఖండించారు.