ఆర్టికల్ 370 గురించి టీచర్లు స్టూడెంట్లకు వివరించాలి: బండి సంజయ్

ఆర్టికల్ 370 గురించి టీచర్లు స్టూడెంట్లకు వివరించాలి: బండి సంజయ్

కరీంనగర్:  ఆర్టికల్ 370ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని టీచర్లు వివరించాలని అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ లోని ఓ ప్రయివేట్ కాలేజీ(అల్ఫోర్స్)లో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఎంపీ బండి సంజయ్, మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..  కాశ్మీర్ పరిరక్షణ కోసం 41836 మంది సైనికులు ప్రాణత్యాగాలు చేశారని, అక్కడున్న పరిస్థితులు చక్కదిద్దేందుకే ప్రధాని ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకొందని ఆయన అన్నారు. మోడీ నిర్ణయానికి టీఆర్ఎస్ కూడా మద్ధతునిచ్చిందని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు దేశ పరిస్థితి, సమాజంలో జరుగుతున్న పరిణామాలు గురించి కూడా తెలుసుకోవాలని ఎంపీ అన్నారు.

వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్  మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు అంతా నేటి విద్యార్థులపైనే అధారపడి ఉందని అన్నారు. తెలంగాణ వాళ్లకు చదువే రాదని మనల్ని సమైక్య రాష్ట్రంలో అవహేళనకు గురి చేసారన్నారు. మనకు సంస్కారమే ఉండదని, చదువు చెప్పడం రాదని అన్నవారికి చెంపదెబ్బ కొట్టేలా చేసామన్నారు. కాలేజీలంటే నారాయణ, శ్రీచైతన్యలేకాదు.. తెలంగాణలోనూ విద్యాసంస్థలు నడపగల సత్తా ఉందని నిరూపించామన్నారు. అందుకే విద్యపై తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు.