
సిరిసిల్ల టౌన్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ టీచర్ల సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీచర్లు, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పీఆర్సీని అమలు చేయాలన్నారు. రిటైర్డ్ అయిన టీచర్లకు వెంటనే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందేలా చూడాలన్నారు. అనంతరం ఏవోకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో వివిధ సంఘాల టీచర్లు పాతూరి మహేందర్ రెడ్డి, శ్రీధర్, రాజేశ్వర్ రావు, రాంనాథ్ రెడ్డి, రవీందర్, సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల టౌన్, వెలుగు: విద్యారంగ, టీచర్ల సమస్యలు పరిష్కరించాలని యూఎస్‌పీసీ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ టీచర్లకు పెండింగ్ డీఏలు, మోడల్ స్కూల్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్.. సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల లీడర్లు శ్యాంసుందర్, రామ్ రెడ్డి, రామచంద్రం, భూమేశ్వర్, నరేందర్, రఘుపతియాదవ్, శ్రీనివాస్, రామేశ్వర్ పాల్గొన్నారు.