న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. తన పదవీకాలాన్ని పొడిగించాలని బీసీసీఐని కోరినట్లుగా తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు పదవిలో కొనసాగాలని భావిస్తున్నట్లు సమాచారం. 2023లో సెలెక్షన్ కమిటీ పగ్గాలు చేపట్టిన అగార్కర్‌కు ఐపీఎల్–2025కు ముందు ఏడాదిపాటు ఎక్స్‌టెన్షన్ లభించింది.
అయితే దాన్ని మరికొంత కాలం పొడిగించాలని బీసీసీఐ పెద్దలను కోరుతున్నాడు. దీనిపై బోర్డు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే టీమిండియా 2025 చాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్ గెలవడంతో అగార్కర్‌కు మరోసారి పదవీకాలం పొడిగింపు లభించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికిప్పుడు అగార్కర్ ప్లేస్‌ను భర్తీ చేసే వాళ్లు లేకపోవడం కూడా అతనికి ప్లస్‌పాయింట్‌గా మారనుంది.
మరోవైపు అగార్కర్ స్థానం కోసం వెస్ట్‌జోన్ నుంచి మాజీ క్రికెటర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నా.. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. మాజీ క్రికెటర్‌గా, కోచ్‌గా (ఢిల్లీ క్యాపిటల్స్), సెలెక్టర్‌గా (ముంబై) పని చేసిన అనుభవం ఉన్న అగార్కర్.. నేషనల్ సెలెక్షన్ కమిటీ పగ్గాలు చేపట్టిన తర్వాత టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది.
