కివీస్‌‌‌‌ను కొట్టేశాం.. ఫైనల్‌‌‌‌కు వచ్చేశాం..

కివీస్‌‌‌‌ను కొట్టేశాం.. ఫైనల్‌‌‌‌కు వచ్చేశాం..
  • కివీస్‌‌‌‌ను కొట్టేశాం.. ఫైనల్‌‌‌‌కు వచ్చేశాం..
  •  కోహ్లీ,అయ్యర్ సెంచరీలు
  • ఏడు వికెట్లతో చెలరేగిన షమీ

అద్భుతం ఆశ్చర్యపోయేలా.. ఆధిపత్యం అచ్చెరువొందేలా.. పరాక్రమం సలాం కొట్టేలా.. వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో టీమిండియా చెలరేగిపోతోంది.లీగ్‌‌‌‌ దశలో అజేయ యాత్రను నాకౌట్‌‌‌‌లోనూ కొనసాగిస్తూ.. కొన్నేండ్లుగా మెగా టోర్నీల్లో మనకు అడ్డొస్తున్న న్యూజిలాండ్ మట్టికరిపిస్తూ  ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లింది.  కింగ్‌‌‌‌  విరాట్‌‌‌‌ కోహ్లీ 50వ వన్డే సెంచరీతో  లెజెండ్ సచిన్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ను అధిగమించిన వేళ మెగా టోర్నీల్లో నాకౌట్‌‌‌‌ భయాన్ని అధిగమిస్తూ.. ముచ్చటగా మూడోసారి వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ను అందుకునేందుకు మరొక్క అడుగు దూరంలోకి వచ్చేసింది. 

వారెవ్వా ఏం  బ్యాటింగ్‌‌‌‌ అది.. ఏం బౌలింగ్‌‌‌‌ అది..! 

పదేండ్లుగా ఐసీసీ టోర్నీల్లో నాకౌట్‌‌‌‌ దశలో తడబడుతున్న టీమిండియా ఈసారి ప్రత్యర్థిని ఏ రేంజ్‌‌‌‌లో  ‘నాకౌట్‌‌‌‌’ చేయొచ్చో చూపెట్టింది. తొలుత కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ సూపర్ సెంచరీలు దంచడంతో భారీ స్కోరు చేసి మానసికంగా పైచేయి సాధించింది. ఆపై షాన్‌‌‌‌దార్ షమీ తన పేస్‌‌‌‌తో మ్యాజిక్‌‌‌‌ చేశాడు. పవర్​ఫుల్ పేస్‌‌‌‌తో  ఏడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌‌‌‌ను ఏడిపించేశాడు.  మొత్తంగా గత వన్డే వరల్డ్ కప్‌‌‌‌ సెమీస్, 2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌‌‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌‌‌‌ చేతిలో ఓటములకు ఓ రేంజ్‌‌‌‌లో రివెంజ్‌‌‌‌ తీర్చుకుంటూ ఇండియా టైటిల్ ఫైట్‌కు చేరుకుంది. వరుసగా పదో విక్టరీతో ఫ్యాన్స్‌‌‌‌ను ఖుషీ చేసిన రోహిత్‌‌‌‌సేన  ఇదే జోరు ఇంకో పోరులో కొనసాగిస్తే కలల కప్పు మన సొంతం అవ్వడం పక్కా!

ముంబై: సొంతగడ్డపై జైత్రయాత్ర కొనసాగించిన టీమిండియా వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో నాలుగోసారి ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లింది. ఫ్యాన్స్‌‌‌‌, సెలబ్రిటీలతో కిక్కిరిసిన వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన తొలి సెమీస్‌‌‌‌లో రోహిత్‌‌‌‌సేన 70  రన్స్‌‌‌‌ తేడాతో కివీస్‌‌‌‌ను చిత్తుగా ఓడించింది. విరాట్ కోహ్లీ (113 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 117), శ్రేయస్ అయ్యర్​ (70 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 105) సెంచరీలతో కదం తొక్కడంతో తొలుత ఇండియా 50 ఓవర్లలో 397/4 స్కోరు చేసింది.  

శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్ (66 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 నాటౌట్) సత్తా చాటగా..  రోహిత్​ శర్మ (29 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47), కేఎల్‌‌‌‌ రాహుల్ (20 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 నాటౌట్) మెరుపులు మెరిపించారు. కివీస్ బౌలర్లలో టిమ్‌‌‌‌ సౌథీ (3/100) మూడు వికెట్లు తీసి వంద రన్స్‌‌‌‌ ఇచ్చుకున్నాడు.  ఛేజింగ్‌‌‌‌లో షమీ (7/57) దెబ్బకు న్యూజిలాండ్  48.5 ఓవర్లలో 327 రన్స్‌‌‌‌కే ఆలౌటై ఓడిపోయింది. డారిల్ మిచెల్ (119 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 134) సెంచరీ, కేన్ విలియమ్సన్ (69) పోరాటం వృథా అయింది. షమీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌గా నిలిచాడు. గురువారం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీస్‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌తో ఆదివారం అహ్మదాబాద్‌‌‌‌లో ఇండియా ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. 

రోహిత్​ పునాది

ఫ్లాట్‌‌‌‌ పిచ్‌‌‌‌పై మరోసారి టాప్‌‌‌‌5 బ్యాటర్లంతా దంచికొట్టడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. కోహ్లీ, శ్రేయస్‌‌‌‌ సెంచరీలతో మెరిసినా స్టార్టింగ్‌‌‌‌లో హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ వేసిన పునాదే కీలకమైంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌ ఎంచుకున్న కెప్టెన్ తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. స్టార్టింగ్‌‌‌‌లోనే కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి వాళ్లను డిఫెన్స్‌‌‌‌లో పడేశాడు. తన ట్రేడ్‌‌‌‌ మార్క్‌‌‌‌ పుల్‌‌‌‌ షాట్లతో ఈజీగా సిక్సర్లు కొడుతూ ఫ్యాన్స్‌‌‌‌కు ట్రీట్‌‌‌‌ ఇచ్చాడు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో ఎక్స్‌‌‌‌ట్రా కవర్ మీదుగా సిక్స్‌‌‌‌ రాబట్టిన అతను సౌథీ బౌలింగ్‌‌‌‌లోనూ ఓ సిక్స్‌‌‌‌ బాదాడు. దాంతో, కివీస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ కేన్‌‌‌‌ ఆరో ఓవర్లోనే స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ శాంట్నర్‌‌‌‌‌‌‌‌ను బరిలోకి దింపగా రోహిత్ 4,6తో అతనికి వెల్‌‌‌‌కం చెప్పాడు. 

అయితే, సౌథీ వేసిన తొమ్మిదో ఓవర్లో మరీ భారీ షాట్‌‌‌‌కు ట్రై చేసిన రోహిత్.. విలియమ్సన్‌‌‌‌ పట్టిన చురుకైన క్యాచ్‌‌‌‌కు ఔటవడంతో తొలి వికెట్‌‌‌‌కు 71 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది.  రోహిత్ ఉన్నంతసేపు స్ట్రయిక్ రొటేట్ చేసిన గిల్ తను ఔటయ్యాక  గేరు మార్చాడు. ఫెర్గూసన్‌‌‌‌ను టార్గెట్‌‌‌‌ చేసి  వెంటవెంటనే మూడు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌ కొట్టి 12 ఓవర్లకే స్కోరు దాటించాడు.  మరో ఎండ్‌‌‌‌లో కోహ్లీ స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేస్తూ గిల్‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌ ఇచ్చాడు. అందమైన షాట్లతో అలరించిన గిల్... శాంట్నర్, ఫిలిప్స్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో క్రీజు ముందుకొచ్చి సిక్సర్లు కొట్టాడు. అతని జోరు చూస్తుంటే సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, కండరాలు పట్టేయడంతో  23వ ఓవర్లో రిటైర్డ్‌‌‌‌ హర్ట్‌‌‌‌గా క్రీజు వీడాడు.

కోహ్లీ, అయ్యర్ జోరు

గిల్‌‌‌‌ రిటైర్‌‌‌‌‌‌‌‌ అయ్యక విరాట్, శ్రేయస్‌‌‌‌ హవా మొదలైంది. అప్పటికే క్రీజులో కుదురుకున్న కోహ్లీ క్రమంగా స్పీడు పెంచాడు.  గత మ్యాచ్‌‌‌‌లో సెంచరీ కొట్టిన ఫామ్‌‌‌‌ను కొనసాగించిన అయ్యర్.. రవీంద్ర బౌలింగ్‌‌‌‌లో 6, 4తో జోరు చూపెట్టాడు. అదే ఓవర్లో సింగిల్‌‌‌‌తో ఫిఫ్టీ (59 బాల్స్‌‌‌‌) పూర్తి చేసుకున్న కోహ్లీ .. సౌథీ బౌలింగ్‌‌‌‌లో లాంగాన్‌‌‌‌ మీదుగా తొలి సిక్స్‌‌‌‌ కొట్టాడు. మరో ఎండ్‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌ అలవోకగా బంతిని స్టాండ్స్‌‌‌‌కు చేర్చసాగాడు. ఈ క్రమంలో 35 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 90లోకి వచ్చిన తర్వాత కాస్త స్లో అయిన విరాట్ ఫెర్గూసన్ వేసిన 42వ ఓవర్లో నాలుగో బాల్‌‌‌‌కు డబుల్‌‌‌‌తో కెరీర్‌‌‌‌‌‌‌‌లో 50వ సెంచరీ పూర్తి చేసుకొని సచిన్ రికార్డును బ్రేక్‌‌‌‌ చేశాడు. 

అదే ఓవర్లో ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టి స్కోరు 300 దాటించాడు. సౌథీ వేసిన 44వ ఓవర్లో సిక్స్‌‌‌‌ కొట్టిన అతను మరో షాట్‌‌‌‌కు ట్రై చేసి కాన్వేకు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో రెండో వికెట్‌‌‌‌కు 163 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ అయింది. స్లాగ్ ఓవర్లలో అయ్యర్‌‌‌‌‌‌‌‌కు తోడైన కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ దూకుడుగా బ్యాటింగ్‌‌‌‌ చేశాడు. రవీంద్ర వేసిన 45వ ఓవర్లో రెండు సిక్సర్లతో 90ల్లోకి వచ్చిన అయ్యర్.. సౌథీ ఓవర్లో సిక్స్‌‌‌‌, సింగిల్‌‌‌‌తో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. ఆపై బౌల్ట్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ సిక్స్‌‌‌‌ బాదగా, రెండు ఫోర్లు బాదిన అయ్యర్ తర్వాతి బాల్‌‌‌‌కు మిచెల్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. సౌథీ వేసిన లాస్ట్‌‌‌‌ ఓవర్లో ఫస్ట్ బాల్‌‌‌‌కే సూర్య  (1)ఔటైనా రాహుల్ 6, 4,4తో ఇన్నింగ్స్‌‌‌‌కు సూపర్‌‌‌‌‌‌‌‌ ఫినిషింగ్‌‌‌‌ ఇచ్చాడు. 

‘ఏడు’పించిన షమీ 

భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో డారిల్‌‌‌‌ మిచెల్, కేన్ విలియమ్సన్ మూడో వికెట్‌‌‌‌కు 181 రన్స్‌‌‌‌ జోడించి కాస్త కంగారు పెట్టినా ఆరంభంలో రెండు.. మధ్యలో మరో రెండు వికెట్లతో షమీ న్యూజిలాండ్‌‌‌‌ను దెబ్బకొట్టి ఇండియాను గెలిపించాడు. తొలి వికెట్‌‌‌‌కు 30 రన్స్‌‌‌‌ జోడించిన  ఓపెనర్లు కాన్వే (13), రాచిన్ (13)ను వరుస ఓవర్లలో పెవిలియన్‌‌‌‌ చేర్చి డబుల్‌‌‌‌ షాకిచ్చాడు. ఈ ఇద్దరూ కీపర్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా 39/2తో బ్లాక్‌‌‌‌క్యాప్స్‌‌‌‌ టీమ్ కష్టాల్లో పడింది. షమీ జోరు చూస్తుంటే ఆ టీమ్‌‌‌‌ కనీస పోటీ ఇస్తే ఎక్కువే అనిపించింది. కానీ, కొత్తగా క్రీజులోకి వచ్చిన కేన్‌‌‌‌,  డారిల్ మిచెల్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దారు. కేన్‌‌‌‌ జాగ్రత్తగా ఆడుతూ స్ట్రయిక్ రొటేట్ చేయగా.. డారిల్ ధనాధన్​ షాట్లతో కౌంటర్‌‌‌‌‌‌‌‌ ఎటాక్‌‌‌‌ చేశాడు. 

సిరాజ్‌‌‌‌ వేసిన 11వ ఓవర్లో రెండు ఫోర్లతో జోరందుకున్న అతను వరుస బౌండ్రీలతో హడలెత్తించాడు. అటు విలియమ్సన్ సైతం క్లాసిక్ షాట్లతో అలరించాడు. స్పిన్నర్లు కుల్దీప్, జడేజా బౌలింగ్‌‌‌‌నూ ఇద్దరూ స్వేచ్ఛగా ఎదుర్కోవడంతో చూస్తుండగానే కివీస్ స్కోరు 200 దాటింది. ఇక, బుమ్రా వేసిన 29వ ఓవర్లో మిచెల్‌‌‌‌ ఇచ్చిన సింపుల్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ను మిడాన్‌‌‌‌లో షమీ డ్రాప్‌‌‌‌ చేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న మిచెల్‌‌‌‌ 85 బాల్స్‌‌‌‌లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో 32 ఓవర్లకు  219/2తో కివీస్ విజయం సాధించేలా కనిపించింది. ఈ టైమ్‌‌‌‌లో మళ్లీ బౌలింగ్‌‌‌‌కు వచ్చిన షమీ మూడు బాల్స్‌‌‌‌ తేడాలో విలియమ్సన్‌‌‌‌తో పాటు టామ్ లాథమ్ (0)ను ఔట్‌‌‌‌ చేసి కివీస్‌‌‌‌కు మరో డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చి మ్యాచ్‌‌‌‌ను ఇండియా చేతుల్లోకి తెచ్చాడు. 

వికెట్లు పడటంతో కాసేపు నెమ్మదించిన డారిల్‌‌‌‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్‌‌‌‌ (41) తర్వాత బ్యాట్లకు పని చెప్పారు. 60 బాల్స్‌‌‌‌లో 132 రన్స్ అవసరమైన టైమ్‌‌‌‌లో సిరాజ్ వేసిన 41వ ఓవర్లో ఫిలిప్స్‌‌‌‌ 6,6,4తో 20 రన్స్‌‌‌‌ రాబట్టడంతో కివీస్‌‌‌‌ మళ్లీ రేసులోకి వచ్చేలా కనిపించింది. తర్వాతి ఓవర్లో కుల్దీప్ రెండే రన్స్‌‌‌‌ ఇవ్వగా 43వ ఓవర్లో బుమ్రా స్లో బాల్‌‌‌‌తో ఫిలిప్స్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేశాడు. తన ఆఖరి ఓవర్లో కుల్దీప్‌‌‌‌.. చాప్‌‌‌‌మన్ (2)ను ఔట్‌‌‌‌ చేయడంతో న్యూజిలాండ్‌‌‌‌ ఓటమి ఖాయమైంది. చివర్లో షమీ దెబ్బకు టెయిలెండర్లు పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టడంతో కివీస్ ఆలౌటైంది.