ఉప్పల్లో మనదే పైచేయి

ఉప్పల్లో మనదే పైచేయి

హైదరాబాద్ వేదికగా కాసేపట్లో  భారత్, ఆస్ట్రేలియా మధ్య  టీ20 మ్యాచ్ జరగబోతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇది చివరిది కావడంతో..దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉప్పల్లో టీమిండియా రికార్డులను ఓసారి పరిశీలిద్దాం..

సూపర్ విక్టరీ..

భారత జట్టు ఇప్పటి వరకు ఉప్పల్ స్టేడియంలో ఒకే టీ20 మ్యాచ్ ఆడింది.  2019లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టే గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  విండీస్ 208 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ఆ తర్వాత టీమిండియా కేవలం 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇక మ్యాచ్లో  విరాట్ కోహ్లీ 94 రన్స్, కేఎల్ రాహుల్ 62 పరుగులు చేశారు. ఇక భారత్ ఇన్నింగ్‌లో 27 సిక్సర్లు నమోదవడం విశేషం.

ఆసీస్తో మ్యాచ్ రద్దు..

ఉప్పల్ క్రికెట్ స్టేడియం 2004లో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం రెండు టీ20 మ్యాచులే జరిగాయి. 2017 అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్ ఇక్కడ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా రద్దయింది.

టెస్టులోనూ విజయం..

2013లో భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్టు జరిగింది. ఇందులోనూ భారతే విజయం సాధించింది.  భారత్ -ఆస్ట్రేలియా మధ్య అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క టెస్టుకు ఉప్పల్ ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్లో  టీమిండియా ఇన్నింగ్ 135 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొత్తానికి ఉప్పల్ స్టేడియంలో టీమిండియాకే మంచి రికార్డ్ ఉంది.

ఉప్పల్ కింగ్ కోహ్లీ...

ఉప్పల్ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. విండీస్ పై  టీ20 మ్యాచ్‌లో  94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక  ఈ పిచ్‌పై బెస్ట్ బౌలింగ్ ఫిగర్‌ చాహల్‌ పేరు మీద ఉంది. తన నాలుగు ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇక అధిక పరుగుల పార్ట్‌నర్‌షిప్‌లో కూడా కోహ్లీ పేరు మీదే ఉండటం విశేషం. కేఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లీ 100 పరుగుల పార్ట్నర్షిప్ ను నమోదు చేశాడు. అధిక  సిక్సులు, ఫోర్ల రికార్డు కూడా కోహ్లీదే. అతను ఆరు ఫోర్లు, సిక్సర్లు బాదాడు.