న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలతో తన పరువుకు భంగం కలుగుతోందని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తక్షణమే ఆ వీడియోలను తొలగించాలని కోరాడు. పలు సోషల్ మీడియా ఖాతాలు, మధ్యవర్తులు, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌తో కలిపి మొత్తం 16 మందిని ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నాడు.
ఆన్‌లైన్‌లో తన అనుమతి లేకుండా పేరు, ఫొటో, గొంతును ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఇలాంటి సైట్లపై శాశ్వత నిషేధాన్ని విధించాలని కోర్టుకు విన్నవించాడు. తన వ్యక్తిత్వ పరిరక్షణతో పాటు రూ. 2.5 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు.
‘డీప్‌ఫేక్ వీడియోల వల్ల వ్యక్తిత్వ హననం జరుగుతోంది. ఏఐ వినియోగిస్తున్న టైమ్‌లో చట్టం, గౌరవాన్ని పట్టించుకోవడం లేదు. నా గుర్తింపు, పేరు, గొంతును ఉపయోగించి అనధికారిక ఖాతాల్లో తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. దీని ద్వారా డబ్బులు కూడా ఆర్జిస్తున్నారు. తక్షణమే వీటిని నియంత్రించాలి’ అని గౌతీ పేర్కొన్నాడు.
ఇటీవల గంభీర్ తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసినట్లుగా వచ్చిన ఓ వీడియోను దాదాపు 29 లక్షల మంది వీక్షించారు. సీనియర్ ప్లేయర్లపై అసభ్యకరంగా మాట్లాడినట్లు వైరల్ అయిన వీడియో 17 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
