కోహ్లీ ఉన్నాడంటే కథ వేరే ఉంటది

కోహ్లీ ఉన్నాడంటే కథ వేరే ఉంటది

భారత జట్టు ఆపద్భందువు...సెంచరీల సామ్రాట్...ఛేజింగ్ మాస్టర్..రన్ మెషీన్..పేరేదైనా...వీరుడొక్కడే. అతనే విరాట్ కోహ్లీ.  క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నానంటూ ఆదుకుంటాడు. బౌలర్ ఎవరైనా...క్రీజులో దిగాడంటే...పరుగుల వరద పారిస్తాడు. మ్యాచ్ ఏ స్థితిలో ఉన్నా..కోహ్లీ ఉన్నాడంటే..కథ వేరే ఉంటది. అందుకే అభిమానులు ముద్దుగా అతన్ని కింగ్ కోహ్లీగా పిలుచుకుంటారు.  టీమిండియాకు ఎంపికైనప్పటి నుంచి ఎన్నో రికార్డులను నెలకొల్పుతూ.. మరెన్నో రికార్డులను తిరగరాస్తూ..వరల్డ్ వైడ్గా అభిమానులను సంపాదించుకున్న  కోహ్లీ ఇవాళ 34వ బర్త్ డే జరుపుకుంటున్నాడు.

తండ్రి చనిపోయినా..మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపించాడు..
1988 నవంబర్‌ 5 న ఢిల్లీలో జన్మించిన విరాట్‌ కోహ్లీ..టాలెంట్ తో అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగాడు. కోహ్లీ తల్లి గృహిణి. తండ్రి క్రిమినల్ లాయర్‌.తన ఇద్దరు సోదరీమణులతో కోహ్లీ ఉత్తమ్ నగర్‌లో పెరిగాడు. ఢిల్లీలోని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్‌లో చదివాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌ పై ఆసక్తి కనభర్చిన కోహ్లీని తన తండ్రి  ఢిల్లీ అకాడమీలో చేర్పించాడు.  2002లో ఢిల్లీ అండర్-15 టీమ్ తో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు.  2003 04 పాలీ ఉమ్రిగర్ ట్రోఫీలో ఢిల్లీ జట్టు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ఢిల్లీ అండర్-17 జట్టుకు కోహ్లీ సెలక్ట్ అయ్యాడు.   రంజీ ట్రోఫీ ఆడే సమయంలో తన తండ్రి చనిపోయినప్పటికీ మ్యాచ్‌ను ఆడి ఒంటి చేత్తో టీంను గెలిపించి క్రికెట్‌ పట్ల తనకున్న నిబద్ధతను నిరూపించుకున్నాడు. 2008 లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నీలో సెంచరీ సాధించిన  తర్వాత టీమిండియాకు సెలక్ట్ అయ్యాడు .

లంకతో అరంగేట్రం..
2008లో సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరూ గాయపడటంతో... శ్రీలంక సిరీస్ కు కోహ్లీ ఎంపికయ్యాడు. ఐడియా కప్‌ ద్వారా మొదటిసారి వన్ డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్లో 12 పరుగులు చేశాడు. ఫస్ట్ మ్యాచ్ లో తక్కువ స్కోరే చేసినా..ఆ తర్వాత మ్యాచుల్లో సత్తా చాటాడు. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపికయ్యాడు. ఐదే సీనియర్ల రాకతో తుది జట్టులో స్థానం దక్కలేదు. ఇక డిసెంబరు 2009 లో శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లి సెంచరీతో రెచ్చిపోయాడు. ఆ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 3–1 స్కోరుతో ఆ సిరీస్ ని కైవసం చేసుకుంది. ఆ  తరువాత  కోహ్లీకి వెనక్కు తిరిగి చూసుకోలేదు. 

ధోని వారసుడిగా...
2014- 15లో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో...టీమిండియా కెప్టెన్ గా కోహ్లీ ఎంపికయ్యాడు. అప్పటి నుంచి భారత జట్టును విజయపథంతో నడిపించాడు. గంగూలీ, ధోనీ తర్వాత అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. మొత్తం 66 టెస్టు్ల్లో టీమిండియాకు నాయకత్వం వహించగా...39 మ్యాచుల్లో భారత జట్టు గెలిచింది. 16 టెస్టుల్లో ఓడింది. 11 మ్యాచులు డ్రాగా ముగిశాయి. కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు స్వదేశంలో 24 మ్యాచుల్లో గెలిస్తే..విదేశాల్లో 15 మ్యాచుల్లో గెలిచింది. 95 వన్డేల్లో టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ...65 మ్యాచుల్లో భారత్ ను గెలిపించాడు. 27 మ్యాచుల్లో ఓడిపోయింది. 3 మ్యాచుల్లో ఫలితం రాలేదు. అటు 50 టీ20ల్లో సారథ్య బాధ్యతలు నిర్వహిస్తే..ఇందులో 30 టీ20ల్లో భారత్ గెలవగా...16 మ్యాచుల్లో ఓడిపోయింది. 4 మ్యాచుల్లో ఫలితం రాలేదు.  అయితే కోహ్లీ సారథ్యంలో..టీమిండియా ఒక్క ఐసీసీ టోర్నీలోనూ విజేతగా నిలవలేకపోయింది. అటు ఐపీఎల్ లో బెంగుళూరు తరపున ఆడిన కోహ్లీ...140 మ్యాచులకు నాయకత్వం వహించాడు. ఇందులో 64 మ్యాచుల్లో జట్టు గెలిస్తే..69 మ్యాచుల్లో ఓడిపోయింది. 

కోహ్లీ కెరీర్..
తన కెరీర్ లో కోహ్లీ ఇప్పటి వరకు 102 టెస్టులు ఆడి..8074 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 అర్థసెంచరీలున్నాయి. 262 వన్డేల్లో 12344 పరుగులు సాధించాడు. ఇందులో 43 సెంచరీలు, 64 అర్థసెంచరీలు ఉన్నాయి. 113 టీ20ల్లో 3932 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 36 అర్థసెంచరీలున్నాయి. అటు ఐపీఎల్ లో 223 మ్యాచులు ఆడగా..6624 రన్స్ చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలున్నాయి 

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాను గెలిపిస్తాడా..?
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో ఆడుతున్న కోహ్లీ సూపర్ ఫాంలో ఉన్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ఆటతీరుతో జట్టును గెలిపించాడు. అయితే తన కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవలేకపోయింది. ఈ నేపథ్యంలో..ఆటగాడిగానైనా జట్టుకు వరల్డ్ కప్ అందించాలని కోహ్లీ కసితో ఆడుతున్నాడు. మరి ఇదే ఫాం కంటిన్యూ చేసి..రాబోయే మ్యాచుల్లో జట్టును గెలిపిస్తాడని అభిమానులు కోహ్లీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి అభిమానుల ఆశలను కోహ్లీ నెరవేరుస్తాడో లేదో చూడాలి...