
- అక్టోబర్‌లో ఆసీస్‌తో వన్డే సిరీస్‌తోనే బరిలోకి
లండన్:టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ తర్వాత మళ్లీ బ్యాట్ పట్టాడు. వన్డే క్రికెట్‌లో బరిలోకి దిగేందుకు లండన్‌లో ట్రెయినింగ్ షురూ చేశాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ నయీమ్ ఆమిన్‌తో కలిసి శుక్రవారం ఇండోర్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ నెట్ సెషన్‌లో కోహ్లీ చాలా హుషారుగా కనిపించాడు.
గ్రే టీ షర్ట్, బ్లూ కలర్ షార్ట్స్ వేసుకున్న లెజెండరీ ప్లేయర్.. కాంపిటేటివ్ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు తన బ్యాటింగ్ స్కిల్స్‌పై ఫోకస్ పెట్టాడు. నెట్ సెషన్ తర్వాత ఆమిన్‌తో దిగిన ఫొటోను అతను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనికి ‘ప్రాక్టీస్‌కు హెల్ప్ చేసినందుకు థ్యాంక్యూ బ్రదర్. నిన్ను కలిసినందుకు హ్యాపీగా ఉంది’ అని పేర్కొన్నాడు. కోహ్లీని కలిసినందుకు సంతోషంగా ఉందన్న నయీమ్.. తనను తిరిగి గ్రౌండ్‌లో చూడాలని ఉందంటూ రిప్లై ఇచ్చాడు.
లంకతో వన్డే సిరీస్‌కు బీసీసీఐ నో
టీ20 వరల్డ్ కప్ నెగ్గిన అనంతరం షార్ట్ ఫార్మాట్‌కు, మేలో టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై వన్డేల్లో మాత్రమే ఇండియాకు ఆడనున్నాడు. అక్టోబర్ 19 నుంచి 25 వరకు ఆస్ట్రేలియాలో జరిగే వన్డే సిరీస్‌లో అతను తిరిగి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడనున్నాడు. వాస్తవానికి ఈ నెలలోనే కోహ్లీ కమ్‌బ్యాక్ చేయాల్సి ఉంది. ఈ నెల 17 నుంచి 31 వరకు బంగ్లాదేశ్‌లో వైట్ బాల్ సిరీస్ (3 వన్డేలు, 3 టీ20లు) పోస్ట్‌పోన్ అవ్వడంతో అది సాధ్యం కాలేదు.
ఇదే సమయంలో టీమిండియా–శ్రీలంక మధ్య వన్డే సిరీస్ కోసం ఇరు దేశాల బోర్డుల మధ్య చర్చలు జరిగాయి. కానీ, ఇంగ్లండ్‌లో లాంగ్ టూర్ తర్వాత ఆసియా కప్ ముంగిట ప్లేయర్లకు నెల రోజులు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ డిసైడైంది. దాంతో ప్రతిపాదిత శ్రీలంక టూర్‌కు పచ్చజెండా ఊపలేకపోయింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీతో పాటు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను తిరిగి బ్లూ జెర్సీలో చూడాలని ఆశిస్తున్న అభిమానులు మరికొంతకాలం వేచి ఉండక తప్పడం లేదు.
కాగా, విరాట్ చివరగా జూన్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో పాల్గొన్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఆ పోరులో 43 రన్స్ చేసిన కోహ్లీ ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు.
విరాట్ మిమిక్రీ చేస్తాడు: ధోనీ
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెప్పాడు. తను పాటలు బాగా పాడతాడని, మిమిక్రీ కూడా చేస్తాడని తెలిపాడు. ‘కోహ్లీ కేవలం గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు. తను బాగా పాటలు పాడతాడు. మంచి డ్యాన్సర్ కూడా. అలాగే మిమిక్రీలోనూ తన టాలెంట్ సూపర్. ఒకవేళ కోహ్లీ సరదా మూడ్‌లో ఉంటే అతనొక అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్’ అని చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో ధోనీ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో
వైరల్ అవుతున్నాయి.
వెరైటీ లుక్‌లో..
విరాట్ కోహ్లీ వెరైటీ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇండియా సంతతికి చెందిన వ్యాపారవేత్త శాష్ షేర్ చేసిన ఫొటోలో విరాట్ తెల్ల గడ్డంతో కనిపించాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతకాలంగా ఫ్యామిలీతో కలిసి లండన్‌లో ఉంటున్న విరాట్ కోహ్లీ ఐపీఎల్ ముగిసిన తర్వాత బయట ఎక్కువగా కనిపించడం లేదు.
చివరగా లండన్‌లో యువరాజ్ సింగ్ నిర్వహించిన ఓ చారిటీ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఆ ఈవెంట్‌లో మాట్లాడుతూ తాను రెండు రోజుల కిందటే గడ్డానికి రంగు వేశానన్నాడు. నాలుగు రోజులకోసారి ఇలా గడ్డానికి రంగు వేస్తున్నామంటే రిటైర్మెంట్ (టెస్టులకు) సమయం వచ్చినట్టేనని కోహ్లీ సరదాగా వ్యాఖ్యానించాడు.