బ్యాటింగ్ బాగుంటేనే!.. నేడు వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో ఇండియా రెండో టీ20

బ్యాటింగ్ బాగుంటేనే!.. నేడు వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో ఇండియా రెండో టీ20

తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఓటమితో హార్దిక్‌‌‌‌‌‌‌‌సేనపై ఒత్తిడి
రా. 8 నుంచి డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో లైవ్

గయానా: వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ షార్ట్ ఫార్మాట్లో ఇంకా బలంగానే ఉన్నామని తొలి టీ20లోనే నిరూపించింది. చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ను కాపాడుకుంటూ ఆ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలిచిన విండీస్ ఒక్కసారిగా టీమిండియాకు బలమైన ప్రత్యర్థిగా మారింది. ఈ నేపథ్యంలో ఐదు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగే రెండో టీ20పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫస్ట్ టీ20 విక్టరీ జోరును కొనసాగించాలని కరీబియన్‌‌‌‌‌‌‌‌ టీమ్ ఆశిస్తుండగా.. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలిచి సిరీస్‌‌‌‌‌‌‌‌లో లెక్క సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. అది జరగాలంటే  ఇండియా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్, ముఖ్యంగా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ స్టార్లు సత్తా చాటాల్సి ఉంది.  

యశస్వికి చాన్స్‌‌‌‌‌‌‌‌!

తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఓడిన ఇండియా రెండో టీ20 కోసం ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేసే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పట్నించే బలమైన టీమ్‌‌‌‌‌‌‌‌ను తయారు చేయాలని మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో సీనియర్లను పక్కనబెట్టి కుర్రాళ్లకు వరుసగా అవకాశాలు ఇస్తోంది. వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో కీలకం అవుతారని భావిస్తున్న హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో మెరవాల్సి ఉంది. తొలి టీ20లో ఆకట్టుకున్న హైదరాబాదీ స్టార్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ మరోసారి కీలకం కానున్నాడు. 9 రోజుల వ్యవధిలో ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల కోసం మూడు దేశాలు (ట్రినిడాడ్‌‌‌‌‌‌‌‌, గయానా, అమెరికా) తిరగాల్సి వస్తుండటంతో వర్క్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా హార్దిక్‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌, ఇషాన్‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌కు రెస్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చే అవకాశాలూ ఉన్నాయి. దీంతో ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌లో శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ వరుసగా ఫెయిలవుతుండటంతో అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌ రావొచ్చు. సంజూకు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మరింత కీలకం కానుంది. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బౌలర్లు సక్సెస్‌‌‌‌‌‌‌‌ కావడంతో వాళ్లపై పెద్దగా ఒత్తిడి లేదు. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ చహల్‌‌‌‌‌‌‌‌కు తోడుగా లెగ్గీ బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తారేమో చూడాలి. పేసర్లలో అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ డెత్‌‌‌‌‌‌‌‌ ఓవర్లలో సత్తా చాటడం కలిసొచ్చే అంశం. ముకేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ కూడా రాణిస్తుండటం శుభసూచకం. 

జోరు మీద విండీస్

టెస్టులు, వన్డేల్లో దిగజారినప్పటికీ టీ20ల్లో వెస్టిండీస్ ఆకట్టుకుంటోంది. ఆస్ట్రేలియా తర్వాత ఆ స్థాయి హిట్లర్లు, ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లతో కూడిన కరీబియన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్లలో సత్తా చాటుతున్నారు. నికోలస్ పూరన్, కైల్ మేయర్, షిమ్రన్ హెట్‌‌‌‌‌‌‌‌ మేయర్, రోవ్‌‌‌‌‌‌‌‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్ అంతా మ్యాచ్‌‌‌‌‌‌‌‌ విన్నర్లే. తొలి టీ20 విక్టరీతో కరీబియన్లు ఫుల్ జోష్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. వీళ్లను ఓడించాలంటే టీమిండియా  అన్నింటా సత్తా చాటాల్సిందే.