సూర్య సెంచరీ..కివీస్పై సూపర్ విక్టరీ

సూర్య సెంచరీ..కివీస్పై సూపర్ విక్టరీ

న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టుపై 65 పరుగుల తేడాతో గెలుపొందింది. 192 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్ సేన..భారత బౌలర్ల ధాటికి...18.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్లో హార్దిక్ సేన 1-0 ఆధిక్యంతో నిలిచింది. 

పంత్ విఫలం..
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6  వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్గా వచ్చిన పంత్ (6) ఔటయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్..ఇషాన్ కిషన్తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. దీంతో టీమిండియా పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. అయితే 36 పరుగులు చేసిన  ఇషాన్ కిషన్ సోదీ బౌలింగ్లో  పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఎక్కువ సేపు క్రీజులోకి నిలవలేకపోయాడు. 

సూర్య సెంచరీ..
ఓ వైపు వికెట్లు పడుతున్నా..సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 పరుగులు చేశాడు. సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సూర్య.... మరో 17 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 5 ఫోర్లు, సిక్స్ బాదాడు. మొత్తం 22 పరుగులు పిండుకొని కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేశాడు. 

సౌథీ హ్యాట్రిక్...
భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కివీస్ బౌలర్ చివరి ఓవర్‌లో టీమ్ సౌథీ హ్యాట్రిక్ సాధించాడు. చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు సాధించాడు. మూడో బంతికి  హార్దిక్ పాండ్యా(13), 4వ బంతికి దీపక్ హుడా(0), 5వ బంతికి వాషింగ్టన్ సుందర్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. వరుస బంతుల్లో ముగ్గురిని  ఔట్ చేసిన టీమ్ సౌథీ  భారత్ ను 200 పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. టీమ్ సౌథీకి  టీ20ల్లో ఇది రెండో హ్యాట్రిక్. ఈ ఫార్మాట్‌లో రెండు హ్యాట్రిక్ లు సాధించిన  రెండో బౌలర్‌గా టీమ్ సౌథీ నిలిచాడు. సౌథీ కంటే  ముందు శ్రీలంక బౌలర్ లసిత్ మలింగా ఈ ఘనత సాధించాడు.

కేన్ ఒక్కడే...
192 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్..ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆరంభంలోని ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఫిన్ అలెన్ భువీ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో డేవిడ్ కాన్వె, కేన్ విలియమ్సన్ జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్కు 56 పరుగులు జోడించారు. అయితే 25 పరుగులు చేసిన కాన్వేను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాత్రం..ఒంటరి పోరాటం చేశాడు. జట్టును గెలిపించాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ..సహకరించేవారే కరువయ్యారు. 52 బంతుల్లో 61 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్..చివరకు 124 పరుగుల వద్ద ఏడో వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో రెండు పరుగుల వ్యవధిలో కివీస్ మూడు వికెట్లు కోల్పోయి..65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.