Asia Cup 2025: ఆసియా కప్‌కు టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించిన బీసీసీఐ.. గిల్‌కు వైస్ కెప్టెన్సీ.. అయ్యర్‌కు నిరాశ

Asia Cup 2025: ఆసియా కప్‌కు టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించిన బీసీసీఐ.. గిల్‌కు వైస్ కెప్టెన్సీ.. అయ్యర్‌కు నిరాశ

ఆసియా కప్ 2025కు టీమిండియా స్క్వాడ్ వచ్చేసింది. 15 మందితో కూడిన భారత జట్టును మంగళవారం (ఆగస్టు 19) అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ముంబైలో విలేఖరుల సమావేశంలో భారత స్క్వాడ్ ను అనౌన్స్ చేశారు. 15 మందితో కూడిన టీమిండియాకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నాడు. శుభమాన్ గిల్ కు వైస్ కెప్టెన్ పగ్గాలు అప్పగించారు. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.  

సెలక్షన్ లో భాగంగా సెలక్టర్లు ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలకు చోటు దక్కింది. సూపర్ ఫామ్ లో ఉన్న తిలక్ వర్మకు స్క్వాడ్ లో చోటు దక్కింది. ఆల్ రౌండర్స్ హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ తన స్థానాలను నిలబెట్టుకున్నారు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడని బుమ్రాకు సెలక్టర్లు చోటు కల్పించారు. పని భారం కారణంగా బుమ్రా మొదట నుంచి ఆసియా కప్ ఆడడనే అపోహలు ఉన్నా.. ప్రధాన టోర్నీ కావడంతో ఎంపిక చేయడం జరిగింది. 

Also read:-రాయుడు ఆల్ టైమ్ టాప్-3 వన్డే, టీ20 బ్యాటర్స్ వీరే.. 

టీ20 స్పెషలిస్ట్ అర్షదీప్ సింగ్, మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఆసియా కప్ లో చోటు దక్కించుకున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్ గా జితేష్ శర్మకు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. బ్యాకప్ పేసర్ గా హర్షిత్ రాణాకు సైతం స్క్వాడ్ లో చోటు లభించింది. ఐపీఎల్ 2025 సీజన్ లో తన బ్యాటింగ్ తో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్ కు నిరాశే మిగిలింది. ఫినిషర్ రింకు సింగ్ తో పాటు ఆల్ రౌండర్ దూబే స్క్వాడ్ లో స్థానం సంపాదించాడు.

ఆసియా 2025 లో మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో  ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్‌‌‌‌‌‌‌‌.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ బరిలో నిలిచాయి. దుబాయ్‌‌‌‌‌‌‌‌, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 19 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి. 2023లో జరిగిన గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగనుంది. ఇండియా మ్యాచ్ ల విషయానికి వస్తే సెప్టెంబర్ 10న యుఎఇతో తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రెండు మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్‌తో గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది.
  

2025 ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్