
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆడింది 55 వన్డే మ్యాచ్ లే అయినప్పటికీ ఈ తెలుగు బ్యాటర్ అద్భుతంగా రాణించాడు. 47 యావరేజ్ తో 1694 పరుగులు చేశాడు. 2019 వరల్డ్ కప్ సమయంలో టీమిండియా స్క్వాడ్ లో స్థానం సంపాదించుకోలేకపోవడంతో మనస్తాపానికి గురైన రాయడు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఐపీఎల్ టోర్నీల్లో ఆడుతూ తన క్రికెట్ కెరీర్ ను కొన్నేళ్ల పాటు కొనసాగించాడు. 2023 ఐపీఎల్ లో చెన్నై తరపున చివరి సీజన్ ఆడిన రాయుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పి కామెంట్రీ అవతారం ఎత్తాడు.
ఇటీవల శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాయుడు.. తన ఆల్ టైమ్ టాప్ త్రీ వన్డే బ్యాటర్లతో పాటు టీ20 బ్యాటర్లను ఎంచుకున్నాడు . టీ20 విషయానికి వస్తే మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లను తన టాప్-3 ప్లేయర్స్ అని చెప్పుకొచ్చాడు. వీరు ముగ్గురు ఇప్పటికే టీ20 ఫార్మాట్ లో తమదైన ముద్ర వేశారు. రాయుడు మాట్లాడుతూ.. "ముందుగా రోహిత్ శర్మ అని నేను అనుకుంటున్నాను. ఎబి డివిలియర్స్, సూర్యకుమార్ నాకు ఇష్టమైన టాప్-3 టీ20 బ్యాటర్లు. వీరితో పాటు క్రిస్ గేల్ కూడా నా ఫేవరేట్ ప్లేయర్. చాలామంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ వీరు ముగ్గురు నా ఫేవరేట్". అని రాయుడు అన్నాడు.
రాయడు తన ఆల్ టైమ్ టాప్ త్రీ వన్డే బ్యాట్స్‌మెన్‌లను సెలక్ట్ చేసుకునే సమయంలో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ వంటి ఆటగాళ్లను పట్టించుకోలేదు. తనకు ఇష్టమైన వన్డే బ్యాట్స్‌మెన్ గురించి అడిగినప్పుడు రాయుడు ముగ్గురు భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లను ఎంచుకున్నాడు. వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. టెండూల్కర్ 463 మ్యాచ్‌ల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు చేశాడు. వీటిలో 49 సెంచరీలు ఉన్నాయి. మరోవైపు విరాట్ కోహ్లీ 51 వన్డే సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. ఓవరాల్ గా 57.88 సగటు.. 93.34 స్ట్రైక్ రేట్‌తో 14,181 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.