ఆర్మీ జవాన్‌‌ కు కన్నీటి వీడ్కోలు ..సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి

ఆర్మీ జవాన్‌‌ కు కన్నీటి వీడ్కోలు ..సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి
  • నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, అధికారులు

కారేపల్లి, వెలుగు: జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్యా తండాకు చెందిన బానోత్ అనిల్ కుమార్(30) ఆర్మీ జవాన్. కాగా విధుల్లో భాగంగా జమ్మూకాశ్మీర్ లో పెట్రోలింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లోయలో పడి ఈనెల 11న ప్రాణాలు కోల్పోయాడు. అనిల్ మృతదేహాన్ని ఆర్మీ అధికారులు ప్రత్యేక వాహనంలో బుధవారం సొంతూరుకు తీసుకొచ్చారు. 

ప్రజలు భారీగా కారేపల్లి క్రాస్ రోడ్ కు చేరుకుని ఆర్మీ జవాన్ అంతిమయాత్ర నిర్వహించారు. అనిల్ అమర హై అంటూ నినాదాలు చేస్తూ నివాళులర్పించారు.  వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్, జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్, ఆర్మీ అధికారులు, వివిధ పార్టీల నేతలు, అధికారులు హాజరై నివాళులర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో అనిల్ అంత్యక్రియలు పూర్తి చేశారు.