
సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్.. ప్రత్యేక హెలికాప్టర్ లో తెలంగాణలోని పలు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2023, నవంబర్ 8వ తేదీ బుధవారం.. సిర్పూర్ కాగజ్ నగర్ సభ ముగించుకుని.. ఆసిఫాబాద్ బయలుదేరారు.
హెలికాఫ్టర్ ఎక్కి.. అందులో కూర్చున్నారు సీఎం కేసీఆర్, ఇతర సిబ్బంది. అయితే ఐదు నిమిషాల తర్వాత కూడా హెలికాఫ్టర్ గాల్లోకి లేవలేదు. దీంతో పైలెట్, ఇతర సిబ్బంది పరిశీలించగా.. హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఉందని.. సరిచేసేందుకు సమయం పడుతుందని వివరించారు.
ఆసిఫాబాద్ సభకు.. సీఎం కేసీఆర్ తన కాన్వాయ్ బస్సులోనే వెళ్లారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు ఉన్నారు.
సీఎం కేసీఆర్ ప్రయాణించే హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడడం.. ఇది రెండోసారి. మొన్నటికి మొన్న దేవరకద్రకు ఇలాగే హెలికాఫ్టర్ లో బయలుదేరారు. గాల్లో ఉండగానే.. టెక్నికల్ సమస్య వచ్చింది. దీంతో పైలెట్ హెలికాఫ్టర్ ను తిరిగి ఎర్రవల్లి ఫాంహౌస్ లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
మూడు రోజుల్లోనే రెండుసార్లు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తటం ఆందోళన కలిగించే అంశం. అసలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బిజీగా ఉన్న కేసీఆర్ కు ఇలాంటి సమస్యలు ఇబ్బంది కరంగా మారాయి. కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేయాలంటూ బీఆర్ఎస్ అభిమానులు కోరుకుంటున్నారు.