పోలీసులు బ్లాక్​ మెయిల్ ​చేస్తున్రు

పోలీసులు బ్లాక్​ మెయిల్ ​చేస్తున్రు
  • కౌన్సిలర్ నుంచి రూ. 30 లక్షలు వసూలు చేసిన్రు
  • తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ భూమయ్య

పెద్దపల్లి, వెలుగు: పోలీసులు బ్లాక్​మెయిల్​చేసి లక్షలు వసూలు చేస్తున్నారని తీన్మార్​మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్​ దాసరి భూమయ్య ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఫంక్షన్​ హాల్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్​ కౌన్సిలర్​ శ్రీనివాస్​ను పట్టణానికి చెందిన ఓ విలేకరి సహకారంతో సీఐ ప్రదీప్​ బెదిరించి డబ్బులు డిమాండ్​చేశాడని చెప్పారు. కౌన్సిలర్ ​శ్రీనివాస్​భయపడి రూ. 30 లక్షలు ఆ విలేకరి ద్వారా సీఐకు అందజేశాడన్నారు. మరో రూ. 15 లక్షలు కావాలని విలేకరి డిమాండ్​చేయడంతో బాధితుడు రామగుండం కమిషనర్​సత్యనారాయణను సంప్రదించారన్నారు. సీఐ నుంచి రూ. 30 లక్షలు కమిషనర్​ తిరిగి శ్రీనివాస్​కు ఇప్పించారని పేర్కొన్నారు. కొంతమంది అవినీతి విలేకరులను అడ్డం పెట్టుకొని  పోలీసులు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసిన సీఐతో పాటు విలేకరిపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. 

ఆరోపణలు అవాస్తవం: సీఐ
తీన్మార్ మల్లన్న రాష్ట్ర కన్వీనర్, మాజీ సీఐ దాసరి భూమయ్య పోలీస్ శాఖపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో భూమయ్య తనతోపాటు పోలీసు శాఖ పై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. గతంలో భూమయ్యతో పనిచేసే సమయంలో ఉన్న మనస్పర్థలను దృష్టిలో ఉంచుకొని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. భూమయ్య ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, దర్యాప్తు చేసి వాస్తవమైతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు.