దొరల పాలన ఖతం చేస్తం

దొరల పాలన ఖతం చేస్తం

యువతే నా ధైర్యం..  ప్రజలే మా బలం
‘వెలుగు’ ఇంటర్వ్యూలో తీన్మార్​ మల్లన్న
ప్రజా పాలన తీసుకురావాలన్నదే మా ప్రయత్నం 
ఎమ్మెల్సీ ఎన్నిక నాకు క్వార్టర్లీ ఎగ్జామ్​.. ఫైనల్​ వేరేలా ఉంటది
ఇప్పుడు చేసింది పది శాతమే.. 90% మిగిలే ఉందని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకట్టుకున్న యూత్​ ఐకాన్ ​తీన్మార్​ మల్లన్న. వరంగల్​‌‌‌‌‌‌–నల్గొండ– ఖమ్మం సెగ్మెంట్​ నుంచి ఇండిపెండెంట్​గా పోటీ చేసిన ఆయన  ప్రధాన పార్టీలకు చెమటలు పట్టించారు. పార్టీలకు అతీతంగా తనకు ప్రజాదరణ ఉందని నిరూపించుకున్నారు. 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఎలక్షన్​లో ఒంటరి పోరాటం చేసి సత్తా చాటుకున్నారు. టీఆర్​ఎస్ అభ్యర్థితో చివరి వరకు హోరాహోరీ తలపడ్డారు. 


మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీ.. జర్నలిస్టు నుంచి సోషల్​ మీడియా యాక్టివిస్ట్ గా ఎదిగిన మల్లన్న.. ఎందుకు పాలిటిక్స్‌‌ను ఎంచుకున్నారు.. ఆయన గోల్​ ఏంటి?  తీన్మార్​ మల్లన్నతో ‘వెలుగు’ స్పెషల్​ ఇంటర్వ్యూ..
వెలుగు: రిజల్ట్ పై మీ రియాక్షన్​..? 
తీన్మార్​ మల్లన్న: అంత పెద్ద బ్యాలెట్​లో నన్ను వెతికి పట్టుకొని నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజలు వంద శాతం సహకరించిన్రు. ప్రజల ఆకాంక్షలు ఓడిపోలేదు. ప్రజలు ఓడిపోలేదు.
ఇంత దాకా వస్తారని అనుకున్నరా?
తప్పకుండా గెలుస్తాననే అనుకున్న.  దొంగ ఓట్లు.. వంద కోట్లతో వాళ్లు గెలిచిన్రు. రూపాయి లేనివాడు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఈ ఎన్నిక ద్వారా నిరూపితమైంది. ఇది నాకు క్వార్టర్లీ ఎగ్జామ్​ లాంటిది. ఫైనల్​ వేరేలా ఉంటది.
ఇంతగా జనం మిమ్మల్ని ఎందుకు ఆదరించిన్రు? 
జనం సమస్యలేమిటో తెలుసు. జనంలో ఉన్నోడ్ని.  ప్రశ్నించే వాడు, తమ సమస్యలకు పరిష్కారం చూపేవాడు కావాలని జనం కోరుకుంటున్నరు. వాళ్ల తరపున నిలబడ్డం. అందుకే అన్ని పార్టీల జనం నన్ను ఆదరించిన్రు. ఇప్పుడు చేసింది పది శాతం మాత్రమే. ఇంకా 90 శాతం మిగిలే ఉంది. 
ప్రధాన పార్టీలను ఢీ కొట్టేందుకు మీకున్న బలం?
ఆరు నెలలు కష్టపడి ప్రతి ఓటరును కలిసిన. నా ఇంటికి వెళ్లకుండా 400 మండలాలు తిరిగిన. ఇది సమస్యలను తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడింది. త్వరలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తం. ప్రజలకు మరింత  దగ్గరవుతం. కేసీఆర్‌‌‌‌ను గద్దె దించడం కోసం పోరాడుతం.
ఎందుకు పొలిటికల్​ కెరీర్​ను ఎంచుకున్నరు?
ప్రజల సమస్యలు తీర్చాలంటే మాస్టర్‌‌‌‌ కీ ఉండాలని అంబేద్కర్‌‌‌‌ చెబుతుండేవారు. మాస్టర్‌‌‌‌ కీ కోసం తిరుగుతున్నం. ఈ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌‌‌‌ రెడ్డి మా మాస్టర్‌‌‌‌ కీని తీసుకునిపోయి దొంగ ఓట్ల బ్యాలెట్‌‌‌‌ బాక్స్‌‌‌‌ వెనుక దాచిపెట్టిన్రు. ఎప్పటికైనా కీ తెచ్చుకుంటం. దొరల పాలన ఖతం చేయడం ఖాయం. 
ఏది మీ అస్త్రం? 
జర్నలిస్టు అనుభవం ప్రశ్నించటం నేర్పింది. సోషల్​ మీడియాలో నాకంటే లక్షల మంది ఫాలోవర్లు ఉన్న లీడర్లున్నరు. కానీ అదే ఉపయోగపడిందని అనుకోను. సోషల్‌‌‌‌ మీడియా నాకో ఆయుధంగా ఉపయోగపడింది. నన్ను  అందరికీ దగ్గరగా చేర్చింది. 
ఏదైనా పార్టీలో చేరుతరా?
ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు. పార్టీలో చేరడం అంటే మురికికూపంలో దూకినట్లే. ప్రజలకు కావల్సింది పార్టీలు కాదని, ప్రజా నాయకుడని ఈ ఎన్నికలతో తేలింది.  ప్రజలను ప్రగతిభవన్‌‌‌‌ కుర్చీ వైపునకు ఎలా తీసుకెళ్లాలి... దొరల పాలనను ఎలా కూల్చేయాలనేదే నా లక్ష్యం. అదే ప్లాన్​ ఆఫ్​ యాక్షన్.

మీ తర్వాతి​ ప్లాన్​ ఏంది? 
ఓడిపోయినా వెనక్కి చూడం. అంబేద్కర్‌‌‌‌, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్​ లాంటి వారే ఓడిపోయారు. ప్రజలే మా బలం. ప్రతి మండలంలో మాది ఒక టీం ఉంటది. ప్రజల సమస్యలను మా టీంలు తెలుసుకుంటయ్​. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తయ్. నా వెంట ఉన్న యువతే నా ధైర్యం. నా సైన్యం. 

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తరు? 
ఎక్కడి నుంచి అని చెప్పలేను. నేనే పోటీ చేయాలనేం రూల్​ లేదు. మా టీమ్​ నుంచి ప్రశ్నించే బలమైన శక్తి పోటీలో ఉంటరు. ఈ ఎన్నికలు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు వార్నింగ్‌‌‌‌ లాంటివి. ఆ పార్టీని గజ్వేల్‌‌‌‌లోనే ఖతం చేస్తం.