తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్‌: జర్నలిస్ట్, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్‌)కు 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ సికింద్రాబాద్ కోర్టు ఆదేశించింది. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ మారుతీ జ్యోతిష్యాలయం నిర్వాహకుడు లక్ష్మీకాంత్‌ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో నిన్న రాత్రి చిలకలగూడ పోలీసులు తీన్మార్ మల్లన్నను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను వర్చువల్ విధానం ద్వారా సికింద్రాబాద్‌ కోర్టు జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. 

ఈ సందర్భంగా మల్లన్నను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని చిలకలగూడ పోలీసులు కోరారు. అయితే మల్లన్న తరఫున వాదనలు వినిపించిన లాయర్ ఉమేశ్ చంద్ర.. పోలీసులు పెట్టిన ఐపీసీ 306 (సూసైడ్‌కు ప్రేరేపించడం), 511 (చోరీకి యత్నించడం) సెక్షన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారుడు ఎప్పుడూ సూసైడ్ అటెంప్ట్‌ చేసిన దాఖలాలు లేవని, అలాంటప్పుడు మల్లన్నపై ఆ సెక్షన్‌ ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆయన వాదనలను పరిశీలనలోకి తీసుకుంటామని న్యాయమూర్తి తెలిపారు. పోలీసుల కస్టడీ విజ్ఞప్తిని పక్కన పెట్టి, 14 రోజుల జుడిషియల్‌ కస్టడీని విధించారు. దీంతో పోలీసులు మల్లన్నను చంచల్‌గూడ జైలుకు తరలించారు.